Thailand: ముగిసిన పదవీకాలం.. థాయ్‌లాండ్ ప్రధానిని సస్పెండ్ చేసిన థాయ్‌లాండ్ రాజ్యాంగ ధర్మాసనం

  • పదవీకాలం ముగిసినా కొనసాగుతున్నారంటూ కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలు
  • ప్రధానిని పదవీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు
  • బాధ్యతలు చేపట్టనున్న ఉప ప్రధాని ప్రవిత్ వాంగ్ సువన్!
Thailand Prime Minister Suspended From Office

ప్రధానమంత్రి పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతున్నారంటూ థాయిలాండ్ ప్రధానిపై ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం వేటేసింది. ఆయనను పదవీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని ప్రయూత్ చాన్-వో-చాను పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.

విచారించిన న్యాయస్థానం ప్రతిపక్షాల వాదనతో ఏకీభవిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని తన పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారా? లేదా? అనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. దీనిపై 15 రోజుల్లోగా ప్రధాని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. థాయ్‌లాండ్ రాజకీయాల్లో రాజ్యాంగ న్యాయస్థానం కీలక పాత్ర పోషించడం ఇదే మొదటిసారి కాదు. 2006, 2014 సాధారణ ఎన్నికల ఫలితాలను కూడా అప్పట్లో కోర్టు రద్దు చేసింది. 

సస్పెన్షన్ నేపథ్యంలో ఉప ప్రధాని ప్రవిత్ వాంగ్ సువన్ ప్రధాని కేర్ టేకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. 6 ఏప్రిల్ 2017 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం.. ప్రధాని 8 సంవత్సరాలకు మించి అధికారంలో ఉండడాన్ని నిరోధిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన యింగ్లక్ షినవత్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మే 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రయూత్ నాయకత్వంలోని సైనిక కూటమి పదవీ కాలం మంగళవారంతో ముగిసిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. 

అయితే, ప్రయూత్ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రయూత్ 9 జూన్ 2019లో బాధ్యతలు చేపట్టారని, కాబట్టి అప్పటి నుంచే ఆయన పదవీకాలం మొదలవుతుందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

More Telugu News