Jaiveer Shergill: కాంగ్రెస్ హైకమాండ్ పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పేసిన జాతీయ అధికార ప్రతినిధి

Jaiveer Shergill resigns to Congress Party
  • రాజీనామా చేసిన జైవీర్ షేర్ గిల్
  • అధినాయకత్వం తీరు పాత చింతకాయపచ్చడిలా ఉందని విమర్శలు
  • ఆధునిక భారత్ తో పొంతన కుదరడం లేదని వ్యాఖ్యలు
  • గాంధీలు ఏడాదిగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆవేదన
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్ గిల్ పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖలో కాంగ్రెస్ హైకమాండ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధినాయకత్వం ప్రచారం చేసుకుంటున్న దార్శనికతకు, యువత ఆశయాలకు ఏమాత్రం పొంతనలేకుండా ఉందని షేర్ గిల్ విమర్శించారు. ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) గత ఏడాది కాలంగా తనకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తున్నారని 39 ఏళ్ల జైవీర్ షేర్ గిల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధుల్లో అందరికంటే చిన్నవాడు షేర్ గిల్. ఇటీవల కొంతకాలంగా పార్టీ మీడియా సమావేశాల్లో షేర్ గిల్ కనిపించడంలేదు. తాజాగా రాజీనామా నిర్ణయంతో ముందుకొచ్చారు. 

"కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనలకు, ఆధునిక భారతదేశంలోని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం సమన్వయం కుదరడంలేదు. నా మనోభావాలను పంచుకునేందుకు సమయం ఇవ్వండంటూ ఏడాదిగా అడుగుతున్నా, నన్ను ఒక్కరు కూడా పార్టీ ఆఫీసుకు రమ్మని ఆహ్వానించలేదు" అని షేర్ గిల్ వాపోయారు. గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి తాను పొందిందేమీలేదని, తానే పార్టీకి సేవ చేశానని స్పష్టం చేశారు. 

"ఇవాళ పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వారి ముందు అణిగిమణిగి పడి ఉండాలంటున్నారు. నాకు అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నాను" అని జైవీర్ షేర్ గిల్ తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో భజనపరులదే రాజ్యమని, భజన సంస్కృతి కాంగ్రెస్ పార్టీని చెదపురుగుల్లా తినేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Jaiveer Shergill
Resignation
Congress
National Spokesperson

More Telugu News