కొడాలి నాని కాలిపై కాలేసి కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... వైర‌ల్ అవుతున్న పాత ఫొటో ఇదిగో

24-08-2022 Wed 14:48 | Entertainment
  • ఒకే ఫ్రేమ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, వంశీ
  • ఎన్టీఆర్‌తో సినిమాలు నిర్మించిన వంశీ, నాని
  • పాత ఫొటోతో గ‌త స్మృతుల‌ను నెమ‌రువేసుకుంటున్న నంద‌మూరి ఫ్యాన్స్‌
a photo of jr  ntr with kodali nani and vallabhaneni vamsi goes viral on social media
సోష‌ల్ మీడియాలో బుధ‌వారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైర‌ల్ అవుతోంది. ట్విట్ట‌ర్‌లో పోస్ట్ అయిన ఈ ఫొటోకు లైకులు, రీ ట్వీట్లు హోరెత్తిపోతున్నాయి. ఇక ఈ ఫొటోపై కామెంట్లు, వాటిపై కౌంట‌ర్ కామెంట్లు కూడా ఓ రేంజిలో సాగుతున్నాయి. వెర‌సి నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆ ఫొటో వైర‌ల్‌గా మారిపోయింది. ఈ ఫొటోను చూసిన నంద‌మూరి ఫ్యాన్స్ అయితే త‌మ హీరోల గురించి గ‌త జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.

ఈ ఫొటోలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, వైసీపీ కీల‌క నేత‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, 2014, 2019 ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్ర‌స్తుతం వైసీపీకి స‌న్నిహితంగా మెల‌గుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఉన్నారు. కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

నాని, వంశీ ఇద్ద‌రూ టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన వారే. వీరిద్ద‌రూ టీడీపీలో ఉండ‌గా... వీరితో జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా స‌న్నిహితంగా మెల‌గేవారు. ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రెండు, మూడు సినిమాల‌కు వంశీ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హరించారు. కొడాలి నాని కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను నిర్మించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ అంటే వీరిద్ద‌రికీ ఎన‌లేని అభిమానం. ఈ కార‌ణంగానే ఏ పార్టీలో ఉన్నా... హ‌రికృష్ణ వ‌చ్చారంటే నాని గానీ, వంశీ గానీ ఆయ‌న వెన్నంటే న‌డిచేవారు. ఈ నేపథ్యంలో వారితో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి వైర‌ల్ కావ‌డం గ‌మ‌నార్హం.