GVL Narasimha Rao: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు

GVL Narasimha Rao response on Amit Shah and Junior NTR meeting
  • అమిత్ షా, తారక్ ఏం మాట్లాడుకున్నారనేది వారిద్దరికే తెలుసన్న జీవీఎల్   
  • లేపాక్షి నాలెడ్జ్ హబ్ లో భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్ స్కామ్ అని విమర్శ 
  • విశాఖలో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణ 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ.. ఇద్దరూ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చే ఉంటాయని అన్నారు. అయితే వారు ఏమేం చర్చించారనేది వారిద్దరికే తెలుసని చెప్పారు. అయినా, వీరి భేటీపై ఇతర పార్టీ నేతలకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారని అన్నారు.  

లేపాక్షి నాలెడ్జి హబ్ లో భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్ స్కామ్ అని జీవీఎల్ పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 500 కోట్లకు కట్టబెట్టడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో ఈ భూములను ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయని అన్నారు. ఈ స్కాం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలకు మేలు చేకూరిందనే ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ స్కామ్ పై తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖలో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని... 50 వేల మందిని జాబితా నుంచి తొలగించారని... దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశామని చెప్పారు.
GVL Narasimha Rao
Amit Shah
BJP
Junior NTR
Tollywood
Delhi Liquor Scam

More Telugu News