delhi: కేజ్రీవాల్ మనుషులు ప్రాణాలైనా ఇస్తారు కానీ ద్రోహం చేయరు: మనీశ్ సిసోడియా

Arvind Kejriwals men will die but will not betray says Manish Sisodia
  • పార్టీ మారేందుకు నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ తలో రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
  • ఆప్ ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర
    చేస్తోందని సిసోడియా ఆరోపణ
  • ఈ సాయంత్రం రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్
మద్యం పాలసీ కేసులో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. ఆప్ నాయకులు తమ పార్టీకి ద్రోహం చేయరని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. నలుగురు ఆప్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ మనుషులు ప్రాణాలైన ఇస్తారు కానీ పార్టీకి ద్రోహం చేయరని అన్నారు.

‘నన్ను దెబ్బకొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు ఇతర ఆప్ ఎమ్మెల్యేలకు రూ. 20-25 కోట్లు ఆఫర్ చేస్తున్నారు, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తామని భయపెట్టి మమ్మల్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. బీజేపీ ఇలాంటి చర్యలు మానుకోవాలి. మేం అరవింద్ కేజ్రీవాల్‌ మనుషులం, భగత్‌ సింగ్‌ అనుచరులం. మేం ప్రాణాలైనా ఇస్తాం కానీ.. ద్రోహం చేయం. మా ముందు ఈడీ, సీబీఐలు పనికిరావు' అని మనీశ్ సిసోడియా ట్వీట్‌ చేశారు.

అంతకుముందు ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా శాసనసభ్యులు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్‌లను బీజేపీ నాయకులు సంప్రదించారు. పార్టీ మారకుంటే సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని బెదిరించారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని, ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకువస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు’ అని చెప్పారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ నుంచి వైదొలగాలని తమను బెదిరిస్తున్నారని కొందరు ఆప్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని, ఇది తీవ్రమైన విషయమని కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి ఆరోపణలపై సిసోడియాపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆప్ ను వదిలేసి వస్తే అన్ని కేసులు తప్పించి, సీఎం పదవి కూడా ఇస్తామని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని సిసోడియా చెప్పిన సంగతి తెలిసిందే.
delhi
AAP
manish sisodia
Arvind Kejriwal
BJP
mlas
bribe

More Telugu News