Nitish Kumar: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి నేడే బలపరీక్ష.. కొన్ని కీలక అంశాలు!

  • బీహార్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243
  • నితీశ్ కుమార్ కూటమి బలం 164
  • స్పీకర్ గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే  విజయ్ కుమార్ సిన్హా
Nitish Kumars Test Of Majority Today

బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ మరోసారి సీఎం పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన డిప్యూటీగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ బాధ్యతలను చేపట్టారు. మరోవైపు, ఈరోజు బీహార్ అసెంబ్లీలో నితీశ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోబోతోంది. 

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి 164 మంది ఎమ్మల్యేల మద్దతు ఉంది. నితీశ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ కూటమికి 163 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. అయితే, ఎమ్మెల్యే సుమీత్ కుమార్ సింగ్ తన మద్దతును ప్రకటించడంతో... బలం 164కి పెరిగింది. 

మరోవైపు అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ స్పీకర్ పదవి నుంచి తప్పుకునేందుకు ఆయన అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో, ఈరోజు బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం నెగ్గిన తర్వాత... స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్జేడీ సీనియర్ నేత అవధ్ బిహారీ చౌధరిని కొత్త స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు 31 మందితో కూడిన తన కేబినెట్ లో ఆర్జేడీకి నితీశ్ కుమార్ పెద్ద పీట వేశారు. 16 బెర్తులను ఆర్జేడీకి ఆయన కేటాయించారు. తన సొంత పార్టీ జేడీయూకి 11 పదవులను ఇచ్చారు. మిగిలిన పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు కట్టబెట్టారు. 

మరోవైపు మహారాష్ట్రలోని పరిణామాలు బీహార్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన రెబెల్ ఏక్ నాథ్ షిండే ఆ పార్టీని చీల్చినట్టే... జేడీయూలో కూడా ఒక ఏక్ నాథ్ షిండేని తెస్తారని... బీహార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని వారు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

More Telugu News