Payyavula Keshav: పీఏసీ చైర్మన్ గా నేను ప్రశ్నించాక కూడా ఈ ప్రభుత్వంలో కదలికలేదు: నాలెడ్జ్ హబ్ భూములపై పయ్యావుల

  • లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట వైఎస్ హయాంలో 10 వేల ఎకరాలు సేకరించారన్న పయ్యావుల
  • రైతులకు కేవలం రూ.2 లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడి 
  • ఆ భూములు ప్రజలకు అప్పగించేందుకు ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అంటూ నిలదీత 
Payyavula responds on knowledge hub lands

లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట సేకరించిన భూముల అవకతవకలపై టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. నాలెడ్జ్ హబ్ కోసం నాడు వైఎస్ సర్కారు 10 వేల ఎకరాలు సేకరించిందని పేర్కొన్నారు. నాలెడ్జ్ హబ్ ద్వారా భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారని అన్నారు. రైతులకు కేవలం రూ.2 లక్షల చొప్పున ఇచ్చారని తెలిపారు. 

9,600 ఎకరాలను ఆనాటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వివరించారు. కియా మోటార్స్ వద్ద భూముల విలువ చూస్తే రూ.1 కోటి 50 లక్షలు అని పయ్యావుల పేర్కొన్నారు. రూ.10 వేల కోట్లు విలువజేసే భూమిని రూ.500 కోట్లకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. 

భూములు కాపాడాలని నాడు చంద్రబాబు కూడా లేఖ రాశారని పయ్యావుల గుర్తుచేశారు. వేల కోట్ల విలువైన భూములపై లేఖ రాస్తే సమాధానం కూడా లేదని ఆరోపించారు. రాంకీ, అరబిందో సంస్థలు మీ భాగస్వామ్య సంస్థలు కాదా? అని నిలదీశారు. పీఏసీ చైర్మన్ గా ఎన్సీఎల్టీ నుంచి వివరాలు కోరానని పయ్యావుల తెలిపారు. 

ఆ భూములు ప్రజలకు అప్పగించేందుకు ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఎన్సీఎల్టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు వినిపించట్లేదు? రేపటి మంత్రివర్గ సమావేశంలోనైనా భూములపై మాట్లాడతారా? అని సూటిగా అడిగారు. ఈ భూముల విషయంపై సీఎం జగన్, క్యాబినెట్ సభ్యులు ఏమైనా దృష్టిపెట్టారా? అని ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని బయటపెట్టినా ప్రభుత్వ పోరాటమేది? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ గా నేను ప్రశ్నించాక కూడా ప్రభుత్వంలో కదలిక లేదని పయ్యావుల మండిపడ్డారు. 

ప్రజల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదనేదే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఈ భూములు ప్రభుత్వం వద్దే ఉండాలి... ప్రైవేటు వ్యక్తులకు దక్కకూడదు అని ఉద్ఘాటించారు. భూముల విషయంలో ప్రభుత్వ చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బంధువుల తరఫున నిలబడతారా? ప్రజల భూములు కాపాడతారా? అంటూ సీఎంను ప్రశ్నించారు. ఆ భూములకు టీడీపీ కాపలాగా ఉంటుందని, విలువైన భూములను ఎవరికీ అప్పనంగా పోనివ్వబోమని అన్నారు.

More Telugu News