Talasani: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపైకి బీజేపీ నేతలు రావడంపై తలసాని మండిపాటు

  • బీజేపీ నేతలది హేయమైన చర్య అన్న తలసాని
  • ఒక ఎంపీ చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకుని ఇంటిపైకి రావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్న
  • మీ ఇళ్లపైకి రావడం పెద్ద విషయం కాదని హెచ్చరిక
Talasani condemns BJP attack on Kavitha residence

ఢీల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ బీజేపీకి చెందిన ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఆరోపించిన తర్వాత తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హైదరాబాద్ లోని కవిత నివాసం వద్ద నిన్న బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో వారిపై టీఆర్ఎస్ శ్రేణులు ఎదురు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. 

మరోవైపు ఈరోజు కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ లతో కలిసి కవిత నివాసానికి ఆయన వెళ్లారు. అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ... కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం దారుణమని అన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కవిత ఇంటిపైకి బీజేపీ నేతలు రావడం దుర్మార్గమని అన్నారు. బీజేపీది ఒక హేయమైన చర్య అని మండిపడ్డారు.  

కవిత ఇంటిపై దాడికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, బీజేపీ నేతలు రావడం సిగ్గు చేటని తలసాని అన్నారు. మీ ఇళ్ల పైకి మేము రావడం పెద్ద విషయం కాదని... తమ టీఆర్ఎస్ సైన్యం ఎంతో తెలుసా? అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి పరిణామాలు పునరావృతం అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒక ఎంపీ మాట్లాడిన అవాస్తవాలు, చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకుని బాధ్యత గల ఒక వ్యక్తి ఇంటిపైకి రావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

More Telugu News