god: ఏ ఒక్క దేవుడూ బ్రాహ్మణుడు కాదు: జేఎన్ యూ వైస్ చాన్స్ లర్ శాంతిశ్రీ

No god is a brahmin Lord Shiva must be from scheduled caste says JNU VC
  • పరమశివుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వాడన్న శాంతిశ్రీ
  • మనుస్మృతి ప్రకారం మహిళలు అందరూ శూద్రులేనన్న వీసీ
  • మహిళకు వివాహం ద్వారా భర్త కులం వస్తుందని వ్యాఖ్య  
దేవుళ్లలో ఒక్కరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు కాదని ఢిల్లీలోని జేఎన్ యూ వైస్ చాన్స్ లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అన్నారు. పరమశివుడు కూడా ఎస్సీ లేదా ఎస్టీకి చెంది ఉండొచ్చన్నారు. ఇటీవల చోటుచేసుకున్న మత హింస ఘటనలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘మానవ శాస్త్ర పరంగా మన దేవుళ్ల మూలాలు ఏంటన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ దేవుడూ బ్రాహ్మిణ్ కాదు. క్షత్రియులే అధికులు. లార్డ్ శివ షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా ట్రైబ్ కు చెంది ఉంటారు. ఎందుకంటే ఆయన శ్మశాన వాటికలో కూర్చుకోవడం, మెడలో పాము ధరించడం, కొన్ని వస్త్రాలే ధరించడం చూడొచ్చు. బ్రాహ్మణులు శ్మశాన వాటికలో కూర్చుంటారని నేను అనుకోవడం లేదు’’ అని శాంతిశ్రీ అన్నారు. ‘లింగ సమానత్వంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు’ అన్న అంశంపై ఆమె మాట్లాడారు. 

మనుస్మృతి ప్రకారం మహిళలు అందరూ శూద్రులే. కనుక ఏ ఒక్క మహిళ కూడా తను బ్రాహ్మణ స్త్రీ అని చెప్పుకోవడానికి లేదు. వివాహం ద్వారా భర్త కులం వస్తుంది. ఇది తిరోగమం కలిగించే విషయంగా నమ్ముతున్నాను’’ అని శాంతిశ్రీ అన్నారు. మానవ శాస్త్ర పరంగా లక్ష్మీ, శక్తి లేదా జగన్నాథ్ అగ్ర కులాలకు చెందిన వారు కాదన్నారు. జగన్నాథ్ గిరిజన జాతికి చెందినవాడిగా పేర్కొన్నారు. ‘‘కనుక ఎందుకు మనం వివక్షను కొనసాగిస్తున్నాం? ఇది ఎంతో అమానవీయం’’ అని ఆమె అన్నారు. 

god
brahmin
Lord Shiva
scheduled caste
JNU VC
controversy

More Telugu News