BJP: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

  • కమెడియన్ మునావర్ ఫరూకీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల
  • కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట నిరసనకారుల ఆందోళన
  • అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు
BJP MLA booked over remark on Prophet

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తర్వాత గత రాత్రి హైదరాబాద్‌లో నిరసనలు చెలరేగాయి. బషీర్‌బాగ్‌లోని నగర కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు నిరసనకు దిగారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజాసింగ్ తమ మనోభావాలను కించపరిచారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

కమెడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తే తాను కూడా ఓ ‘కామెడీ’ వీడియోను విడుదల చేస్తానని రాజాసింగ్ గతంలోనే హెచ్చరించారు. ఆయన షో నిర్వహించకుండా అడ్డుకోవాలని, లేదంటే వేదికను తగలబెడతానని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మునావర్ ఫరూకీ షో రోజున పోలీసులు రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మునావర్ ఫరూకీ షో నిర్వహించాడు. దీంతో ముందు చెప్పినట్టుగానే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తాజా వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. మునావర్ ఫరూకీ తమ మనోభావాలను కించపరిచాడని ఆరోపించారు. ఫరూకీపైనా, ఆయన తల్లిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, మహ్మద్ ప్రవక్తపైనా వ్యాఖ్యలు చేశారు.

More Telugu News