Yuan Wang-5: ఆరు రోజుల తర్వాత శ్రీలంక రేవును వీడిన చైనా నౌక

  • ఈ నెల 16న హంబన్ టోట పోర్టుకు విచ్చేసిన యువాంగ్ వాంగ్-5
  • భారత్ తీవ్ర అభ్యంతరాలు
  • అది నిఘా నౌక అని ఆరోపణ
  • అయినప్పటికీ అనుమతి ఇచ్చిన శ్రీలంక
China vessel Yuan Wang 5 leaves Sri Lankan port of Humbantota after six days

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చైనా నౌక యువాన్ వాంగ్-5 ఆరు రోజుల తర్వాత శ్రీలంకలోని హంబన్ టోట రేవు నుంచి తిరుగుప్రయాణమైంది. ఈ నౌక శ్రీలంకకు రావడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ నౌకకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హంబన్ టోట రేవును చైనా నిర్వహిస్తోంది. 

అయితే ఆ ముసుగులో చైనా తన గూఢచార నౌకలను భారత భూభాగానికి సమీపంలోకి తీసుకువస్తోందని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పరిశోధన, సర్వే నౌకగా శ్రీలంక తీరానికి వచ్చిన యువాన్ వాంగ్-5 నౌకలో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలపై ఓ కన్నేసి ఉంచగల సాధన సంపత్తి ఉందని భారత్ ఆరోపిస్తోంది. 

వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11నే హంబన్ టోట రేవుకు చేరాల్సి ఉంది. అయితే భారత్ అభ్యంతరాల నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం జాప్యం చేసింది. దాంతో ఆ చైనా నౌక ఐదు రోజుల ఆలస్యంగా ఆగస్టు 16న లంక తీరానికి చేరింది. ఇంధనం, ఆహార పదార్థాలు, మంచినీరు, తదితర నిత్యావసరాలు నింపుకున్న పిదప నేటి సాయంత్రం 4 గంటలకు హంబన్ టోట రేవును వీడిందని హార్బర్ ముఖ్యాధికారి నిర్మల్ సిల్వా వెల్లడించారు. 

యువాన్ వాంగ్-5 నౌక తదుపరి మజిలీ చైనాలోని జియాంగ్ ఇన్ పోర్టు అని అధికారులు వెల్లడించారు. శ్రీలంకలోకి చైనా దౌత్యకార్యాలయం సూచించిన మేరకు ఆ నౌకా వర్గాలకు తగిన సహాయసహకారాలు అందించామని హంబన్ టోట పోర్టు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News