JBL: పార్టీల్లో జోష్​ నింపేలా ప్రత్యేక స్పీకర్లను విడుదల చేసిన జేబీఎల్​.. ప్రత్యేకతలు, ధరలు ఇవిగో

  • జేబీఎల్ పార్టీ బాక్స్ 710, పార్టీ బాక్స్ 110, పార్టీ బాక్స్ ఎన్ కోర్ ఎస్సెన్షియల్ మోడళ్లను ప్రవేశపెట్టిన జేబీఎల్
  • బ్లూటూత్ 5.1, నీటి తడిని తట్టుకునేలా ఐపీఎక్స్ 4 డిజైన్ తో అందుబాటులోకి..
  • స్పీకర్లపై ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లతో లైట్ షో ఉన్నట్టు సంస్థ వెల్లడి
JBL Launched partybox 710 110 encore essential models specifications here

ప్రముఖ ఆడియో ఉపకరణాల సంస్థ జేబీఎల్ తాజాగా పార్టీ ప్రియుల కోసం ప్రత్యేకమైన స్పీకర్ శ్రేణులను ప్రకటించింది. జేబీఎల్ పార్టీ బాక్స్ 710, పార్టీ బాక్స్ 110, పార్టీ బాక్స్ ఎన్ కోర్ ఎస్సెన్షియల్ మోడళ్లను మన దేశంలో ప్రవేశపెట్టింది. బ్లూటూత్ 5.1 తోపాటు నీటి తడిని తట్టుకునేలా ఐపీఎక్స్ 4 సదుపాయం (వాటర్ రెసిస్టెన్స్), ప్రత్యేకమైన ట్రూ వైర్ లెస్ (టీడబ్ల్యూఎస్) టెక్నాలజీతో కొత్త స్పీకర్లను తీసుకువచ్చినట్టు కంపెనీ తెలిపింది.

స్పీకర్లపై ప్రత్యేమైన ఎల్ఈడీలతో లైట్ షో సదుపాయం ఉంటుందని.. ధ్వనికి తగినట్టుగా వెలిగే ఈ లైటింగ్ ను యూజర్లు తమకు నచ్చినట్టు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుందని వెల్లడించింది. వీటిని తమ వెబ్ సైట్ తో పాటు ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయానికి పెట్టినట్టు తెలిపింది. జేబీఎల్ పార్టీ బాక్స్ యాప్ ద్వారా వీటిని నియంత్రించవచ్చని వివరించింది.

భారీ ధ్వనితో జేబీఎల్ పార్టీ బాక్స్ 710
ఈ స్పీకర్ లో అత్యంత భారీగా 800 వాట్ల ధ్వని అవుట్ పుట్ ఉంటుంది. పార్టీకి తగినట్టుగా మార్చుకునేలా మూడు రకాల లైటింగ్ సదుపాయం ఉంది. స్పీకర్ పై భాగంలో దీనికి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి. బ్లూటూత్ యాప్ తో పాటు వీటి సాయంతోనూ స్పీకర్లను నియంత్రించుకోవచ్చు. ఎనిమిది వూఫర్లు, రెండు ట్వీటర్లతో అద్భుతమైన ధ్వని అనుభూతి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని బరువు 27.8 కిలోలు అని.. అటూ ఇటూ కదపడానికి వీలుగా స్పీకర్ దిగువన వీల్స్ ఉంటాయని వివరించింది. దీని ధర రూ.64,999గా పేర్కొంది.

రీచార్జబుల్ సౌకర్యంతో జేబీఎల్ పార్టీ బాక్స్ 110
ఏకంగా 160 వాట్ల గణనీయమైన ధ్వని అవుట్ పుట్ ను అందించగలిగే రీచార్జబుల్ స్పీకర్ ఇది. ఇందులో 36 డబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చామని.. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 12 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్పీకర్ బరువు 10.84 కిలోలు. డబ్ల్యూఎస్ టెక్నాలజీ ఆధారంగా.. దగ్గరిలోని ఇదే మోడల్ స్పీకర్ తో కనెక్ట్ అయ్యి.. రెండూ కలిసి స్టీరియో ధ్వనిని అందించగలవని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.31,999గా పేర్కొంది.

రీచార్జబుల్, పోర్టబుల్ సౌకర్యంతో జేబీఎల్ పార్టీ బాక్స్ ఎన్ కోర్ ఎసెన్షియల్స్
100 వాట్ల సౌండ్ అవుట్ పుట్ సామర్థ్యంతో కూడిన ఈ స్పీకర్ లో 17.76 డబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చినట్టు కంపెనీ తెలిపింది. దీనితో ఆరు గంటల పాటు నాన్ స్టాప్ గా మ్యూజిక్ వినవచ్చని వెల్లడించింది. దీని బరువు 5.9 కిలోలు. ఇది కూడా ఇదే మోడల్ స్పీకర్ తో కనెక్ట్ అయి స్టీరియో ధ్వనిని అందించగలదని తెలిపింది. దీని ధర రూ.24,999గా వెల్లడించింది.


More Telugu News