Nagababu: థియేటర్ లో అలా అవమానం జరిగిన ఆ రోజే ఇండస్ట్రీలో నెంబర్ వన్ అవుతానని అన్నయ్య చెప్పారు: నాగబాబు

  • నేడు చిరంజీవి పుట్టినరోజు
  • మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొన్న నాగబాబు
  • చిరంజీవి కెరీర్ తొలిరోజులను వివరించిన వైనం
  • చిరంజీవి ఆత్మస్థైర్యం గురించి వివరించిన మెగాబ్రదర్
Nagababu reveals interesting fact about his brother Megastar Chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో మెగాబ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలామందికి తెలియని ఓ విషయం చెప్పారు. ఈ విషయం చిరంజీవి గారు కూడా మర్చిపోయి ఉంటారని, మీడియాలోనూ చాలామందికి తెలియదని, చాలామంది వ్యక్తులకు కూడా తెలియని విషయం అని అన్నారు. ఇప్పటి యువతకు ప్రేరణ కలిగించే విషయం అవుతుందని ఇప్పుడు అందరికీ చెబుతున్నానని నాగబాబు వెల్లడించారు.

"అప్పుడు చిరంజీవికి 21 ఏళ్లుంటాయి. మద్రాసులో సినిమా ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నాడు. ఆ సమయంలో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ఒకే రూములో ఉండేవారు. అప్పుడు మాకేమీ తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, తండ్రులు ఇచ్చిన కోట్లు లేవు, అక్రమంగా సంపాదించిన స్థలాలు లేవు. మా నాన్న ఓ సాధారణ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్. ఆయన నెలకు రూ.200 పంపిస్తే వాటితోనే అన్నయ్య సర్దుకునేవాడు. 

అప్పట్లో అన్నయ్య వాళ్ల రూము పక్కనే పూర్ణా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఉండేది. పూర్ణా కామరాజ్ గారు దానికి యజమాని. అందులో సుబ్రహ్మణ్యం గారని ఒకాయన మేనేజర్ గా పనిచేసేవారు. వాళ్లబ్బాయి పేరు సూర్య. సూర్య వాళ్ల అమ్మగారు చిరంజీవిని, ఆయన మిత్రులను ఎంతో బాగా చూసుకునేవారు. తమ ఇంటికి అప్పుడప్పుడు కాఫీ, టిఫిన్లకు పిలిచేవారు. అంతేకాదు, తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజయ్యే సినిమాల ప్రివ్యూలకు చిరంజీవిని, ఆయన మిత్రులను కూడా పిలిచేవారు. ఓసారి కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధం కాగా, ఆ సినిమాను ప్రివ్యూ వేశారు. 

చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ లను కూడా ప్రివ్యూకి వెళ్లి ఆ సినిమా ఎలా ఉందో చెప్పాలని ఆమె సూచించారు. దాంతో చిరంజీవి తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రివ్యూ థియేటర్ లో మొదటి వరుసలో కూర్చున్నాడు. అంతలో ఆ సినిమాలో నటించిన హీరో వచ్చి, తన డ్రైవరు, ఇతర పనివాళ్ల కోసం చిరంజీవిని, అతడి మిత్రులను సీట్లలోంచి లేపేశాడు. దాంతో చిరంజీవి, అతని మిత్రులు బయటికి వెళ్లలేని పరిస్థితి, వెనుక సీట్లో కూర్చుని సినిమా చూడలేరు. సినిమా అయిపోయేంత వరకు నిల్చునే సినిమా చూశారు. సినిమా అయిపోగానే రూమ్ కు వెళ్లిపోయారు. 

హరిప్రసాద్, సుధాకర్ రెడీ అయిపోయి సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్లి, ఆయన భార్య ఇచ్చిన కాఫీ, టిఫిన్లు తీసుకుంటున్నారు. చిరంజీవి రాకపోయేసరికి ఆమె వాళ్లబ్బాయి సూర్యాను పంపించింది. ఆ సమయంలో చిరంజీవి వంటి మీద చొక్కాలేకుండా, తలకు నూనె పెట్టుకుని ఉన్నారు. అప్పట్లో అన్నయ్యకు మొటిమలు ఉండేవి... దాంతో అందం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఇంతలో సూర్య వచ్చి... అమ్మ పిలుస్తోందని చెప్పాడు. వస్తానని చెప్పు... అన్నాడు. ఇప్పుడే రమ్మంటోంది అనేసరికి, 'ఏయ్ వెళ్లవోయ్... వస్తాను' అనేసరికి ఆ అబ్బాయి సైలెంట్ గా వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత అన్నయ్య వచ్చి ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ మౌనంగా ఉండిపోయాడు. దాంతో ఆమె అన్నయ్యను ఎందుకిలా ఉన్నావు? అని అడిగారు. అప్పుడు అన్నయ్య ఇలా చెప్పాడు.... 'ఆంటీ, మీరు పంపిస్తే మీ అతిథులుగా మేం ప్రివ్యూకు వెళ్లాం. మాకేమీ వెనుక సీట్లో కూర్చోవాలని లేదు. ముందు సీట్లలో కూర్చుని సినిమా చూస్తున్న మమ్మల్ని ఆ హీరో వచ్చి లేపేశాడు. దాంతో గుమ్మం దగ్గరే నిల్చుని సినిమా చూశాం. మీ అతిథులం కాబట్టి మేం బయటికి వచ్చేస్తే బాగుండదని అలాగే నిల్చుని సినిమా చూశాం. వీళ్లందరికీ బాగా బలిసి కొట్టుకుంటున్నారు ఆంటీ' అన్నాడు. ఆ హీరో ఎప్పుడూ అంతే బాబూ అని ఆంటీ గారు అన్నారు. 'కాదు ఆంటీ.... మీరు చూస్తూ ఉండండి... ఈ ఇండస్ట్రీకి నేను నెంబర్ వన్ హీరో కాకపోతే చూడండి' అన్నాడు. ఆ విషయం సూర్య చెబితే నాకు తెలిసింది. అన్నయ్య కూడా దాదాపు మర్చిపోయారు. 

ఇండస్ట్రీలో నటుడు అవ్వాలని వచ్చిన వ్యక్తికి ఇలాంటి అవమానం కూడా ఒక ప్రేరణగా మారింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులు ఉన్నారు. అయినా కూడా అన్నయ్య ధైర్యంగా నెంబర్ వన్ అవుతానని చెప్పారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేని వ్యక్తి ఆ మాట అనడానికి ఎక్కడ్నించి వచ్చింది అంత హోప్...? ఆ తర్వాత జరగిందంతా అందరికీ తెలిసిందే. 

ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఎంతవరకు వెళ్లిందంటే ఒక తమ్ముడ్ని నిర్మాతగా నిలబెట్టాడు... తనకో జీవితాన్నిచ్చాడు...  అది నేను. ఇంకొక తమ్ముడు పవన్ కల్యాణ్. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. దర్శకత్వంపై ఆసక్తి చూపిస్తున్న పవన్ ను, నీలో స్పార్క్ ఉంది, నీలో నాకు హీరో కనిపిస్తున్నాడు, దర్శకత్వం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని మార్గదర్శనం చేశారు. ఇవాళ ఒక పవర్ స్టార్ గా మీ అందరి ముందుకు వచ్చాడు, జనసేనతో రాజకీయ చైతన్యం తీసుకువస్తున్నాడు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల దమ్మున్న వ్యక్తి పవన్ కల్యాణ్. అంతగొప్ప నాయకుడ్ని ఆంధ్రదేశానికి కానుకగా ఇచ్చిన వ్యక్తి చిరంజీవి. అంతేకాదు, బన్నీ, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్, నిహారిక, శిరీష్ వీళ్లందరికీ ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చాడు" అంటూ నాగబాబు వివరించారు.

More Telugu News