Jayalalitha: జయకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదు: ఎయిమ్స్ వైద్య బృందం నివేదికలో వెల్లడి

  • అపోలో ఆసుపత్రిలో చేరే నాటికే బీపీ, షుగర్, థైరాయిడ్ తో బాధపడుతున్న జయ
  • డిసెంబర్ 4న శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డ వైనం
  • 5వ తేదీన ఆగిపోయిన గుండె, మెదడు
AIIMS report on Jayalalitha medical treatment

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 2016లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె మరణంపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. జయ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. 

దీంతో, అప్పటి సీఎం పళనిస్వామి విశ్రాంత న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ ను నియమించారు. ఈ కమిషన్ జయ మరణం విషయంలో ఎందరినో విచారించింది. మరోవైపు, కమిషన్ కు ఎయిమ్స్ వైద్య బృందం మూడు పేజీల నివేదికను ఇచ్చింది. అపోలో ఆసుపత్రిలో చేరక ముందు ఆమె స్వీట్లు, కేక్, ద్రాక్షపళ్లను తిన్నారని ఆమె ఫ్యామిలీ డాక్టర్ శివకుమార్ పేర్కొన్నారు. 

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరకముందే జయలలితకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నాయని ఎయిమ్స్ వైద్య బృందం తెలిపింది.  2016 సెప్టెంబర్ 28న ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని వెల్లడించింది. అక్టోబర్ 7న ఆమెకు ట్రాకియోస్టమీ చికిత్స ను ప్రారంభించారని తెలిపింది. అక్టోబర్ 14 నుంచి లండన్ డాక్టర్ రిచర్డ్ బిలే, ఎయిమ్స్ వైద్యులు, అపోలో ప్రత్యేక వైద్యులు జయకు చికిత్స అందించారని చెప్పింది. 

డిసెంబర్ 3వ తేదీ నాటికి జయ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపింది. 4వ తేదీన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని... దీంతో ఆమెకు ఎక్మో ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షించారని పేర్కొంది. 5వ తేదీన ఆమె గుండె, మెదడు పని చేయలేదని... ఆమె మృతి చెందారని చెప్పింది. జయకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదని తన నివేదికలో స్పష్టం చేసింది.

More Telugu News