Andhra Pradesh: సుజ‌నా చౌద‌రి స్క్రిప్టును అనురాగ్ ఠాకూర్ చ‌దివారు: మంత్రి జోగి ర‌మేశ్

ap minister jogi ramesh attacks on union minister anurag thakur comments
  • టీడీపీ ఆఫీస్ నుంచి వ‌చ్చిన స్క్రిప్టును ఠాకూర్ చ‌దివార‌న్న జోగి
  • అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్ర‌శ్న‌
  • మూడేళ్లలో 2 లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్ల‌డి
విజ‌య‌వాడ‌ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌... జ‌గ‌న్‌ స‌ర్కారుపై చేసిన విమ‌ర్శ‌ల‌ను ఏపీ మంత్రి జోగి ర‌మేశ్ తిప్పికొట్టారు. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చి ఇచ్చిన‌ స్క్రిప్టును అనురాగ్ ఠాగూర్ చదివారన్న ర‌మేశ్‌.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ఠాకూర్ తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని ఆయ‌న పేర్కొన్నారు. 90 వేల మందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ఆయ‌న కేంద్ర మంత్రిని నిల‌దీశారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ నేత‌లు ఆశ పడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. 

ఏపీలో యువతకు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్న‌ అంశంపై చర్చకు వస్తారా? అని జోగి ర‌మేశ్ బీజేపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. రాష్ట్రంలో దోపిడీ చేసింది మీరు పెంచి పోషించిన చంద్రబాబేన‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ నేత‌ల‌కు అసలు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? అని కూడా ఆయ‌న నిల‌దీశారు. ఏపీని నిలువునా మోసం చేసిన బీజేపీకి ఏం చూసి ఓటెయ్యాలి? అని ప్ర‌శ్నించిన ర‌మేశ్.. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు కదా.. వార్డు సభ్యునిగా కూడా బీజేపీ నేత‌లు గెలవలేరు అన్నారు.
Andhra Pradesh
YSRCP
BJP
Anurag Thakur
Vijayawada
Sujana Chowdary
Jogi Ramesh

More Telugu News