విశాఖలో నారా లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు... నిరసనగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ అగ్ర నేత
- పలాస పర్యటనకు బయలుదేరిన లోకేశ్
- అమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద లోకేశ్ అడ్డగింత
- పోలీస్ వ్యాన్‌లో లోకేశ్‌ను విశాఖ తరలించిన పోలీసులు
- విశాఖలో లోకేశ్ మీడియా సమావేశానికి అనుమతించని పోలీసులు
విశాఖలోని మధురవాడ జంక్షన్ వద్ద లోకేశ్‌ను వదిలేసిన పోలీసులు... ఆ తర్వాత లోకేశ్ నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా అడ్డుకున్నారు. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ అయినందున మీడియా సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు... మీడియా సమావేశం నిర్వహించడం కుదరదని తేల్చేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా నారా లోకేశ్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వాదనలను ఎంతగా వినిపించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనతో పలాసలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యే లేదని ఆయన తెలిపారు. అయినా పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే... జగన్ సర్కారు తన పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని లోకేశ్ ఆరోపించారు.