foods: ఈ ఆహారంతో చిన్నారులు.. ‘ఆరడుగుల బుల్లెట్’

  • ఎత్తు పెరగాలంటే మంచి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాల్సిందే
  • ఎత్తుపై జన్యువుల పాత్ర కూడా
  • తగినంత నిద్ర కూడా అవసరమే
  • పాలు, గుడ్లు, సోయాతో మంచి ఫలితాలు
foods that can help in increasing the height of children

పిల్లలకు అన్ని రకాల అభివృద్ధి (ఆల్ రౌండ్ డెవలప్ మెంట్) అవసరమని వైద్యులు చెబుతుంటారు. ఇందుకు బీజం తీసుకునే ఆహారంలోనే ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒక వ్యక్తి శరీర బరువు, ఎత్తు, బీఎంఐ అన్నవి వారి జన్యువుల ఆధారంగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో ముఖ్యంగా పిల్లల ఎత్తు విషయంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. పిల్లలకు నిద్ర సంబంధ సమస్యలు ఉన్నా కానీ, వారి ఎత్తు పెరుగుదల ప్రభావితం అవుతుందని, గ్రోత్ హార్మోన్ తగ్గుతుందని పలు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 


పోషకాహారం/ఆహారం
తీసుకునే ఆహారానికి, ఎత్తుకు సంబంధం ఉంటుంది. హెల్త్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వివరాల ప్రకారం.. పాల ఉత్పత్తులు, చికెన్, జంతు సంబంధ ఉత్పత్తులు తీసుకున్న వారు ఎత్తు మంచిగా పెరుగుతారని తెలిసింది. ఆరోగ్యకరమైన ఎత్తు వల్ల వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. స్త్రీల్లో 18 ఏళ్లు, పురుషుల్లో 21 ఏళ్ల వరకు ఎత్తు పెరుగుతారు. అంటే ఆ వయసుకి వారి గరిష్ఠ ఎత్తుకు చేరతారు. సగటున 5.6/5.7 అడుగులు ఎక్కువ మంది ఉంటుంటారు. సరైన ఆహారం ఇస్తే వీరు మరికొన్ని అంగుళాలు సహజంగా పెరిగేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

పాల ఉత్పత్తులు..
ఎత్తు పెరగాలని అనుకునే వారు పాలు, పాల పదార్థాలను తగినంత తీసుకోవడం కీలకం. పాలు, చీజ్, పన్నీరు, పెరుగు, ఐస్ క్రీమ్ ఇలా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. విటమిన్ ఏ, బీ, డీ, ఈ వీటి ద్వారా ఎక్కువగా లభిస్తాయి. ఎత్తు పెరిగేందుకు విటమిన్ డీ, క్యాల్షియం ఎంతో అవసరం అవుతుంది. 

పిండి పదార్థాలు/ధాన్యాలు
శరీరంలో శక్తికి పిండి పదార్థాలు, ఆహార ధాన్యాలు కీలకం. ఇవి విటమిన్ బీతోపాటు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం అందిస్తాయి. బ్రౌన్ రైస్, పాప్ కార్న్, హోల్ వీట్ తో చేసినవి పిల్లల వృద్ధికి అనుకూలిస్తాయి.

గుడ్లు
గుడ్ల ద్వారా ప్రొటీన్లు తగినన్ని శరీరానికి అందుతాయి. గుడ్డులోని తెల్లసొన అంతా ప్రొటీన్లే. కావాలంటే పచ్చసొన విడిచి పెట్టొచ్చు. గుడ్లలో విటమిన్ బీ2 కూడా ఉంటుంది. ఎత్తు పెరగాలని కోరుకునే వారు చిన్నారుల ఆహారంలో గుడ్లను తప్పక భాగం చేయాలి.

సోయాబీన్
కూరగాయలు అన్నింటిలోకీ సోయాబీన్ లో ప్రొటీన్లు ఎక్కువ. ఇవి ఎముకలు, టిష్యూలకు ఉపకరిస్తాయి. ఎత్తు పెరగాలని కోరుకునే వారు, నిత్యం 50 గ్రాముల సోయా ఉత్పత్తులు తీసుకోవాలి. శాఖాహారుల ప్రొటీన్ లోపానికి ఇదో చక్కని పరిష్కారం. అలాగే, ఆకుపచ్చని కూరగాయలతోనూ ఫలితం ఉంటుంది. వీటిల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఫొలేట్, ఫైబర్, ఇలా ఎన్నో ఉన్నాయి.

అరటి పండ్లు
ఎత్తు పెరగాలని కోరుకుంటే పిల్లలకు అరటి పండ్లు కూడా పెట్టాలి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఫైబర్, విటమిన్ బీ6, సీ, ఏతోపాటు, ఆరోగ్యకరమైన ప్రోబయాటిక్స్ కూడా లభిస్తాయి. 

చేపలు
వీటిల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎత్తుకు అనుకూలిస్తుంది. 100 గ్రాముల సాల్మన్ చేపల్లో 2.3 గ్రాముల ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, సిలీనియం ఉంటాయి.

More Telugu News