తాప్సీ ‘దొబారా’ థియేటర్ల వైపు చూడని ప్రేక్షకులు

21-08-2022 Sun 11:51
  • భారీ డిజాస్టర్ గా మిగలనున్న కొత్త చిత్రం
  • ఈ నెల 19న విడుదలైన ‘దొబారా’
  • రెండు రోజుల్లో కేవలం రూ. 1.4 కోట్లే రాబట్టిన సినిమా
Taapsee Pannus film dobaara crashes shows get cancelled
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలైంది. సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావడం లేదు. రెండు రోజుల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా రూ. 1.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటికే  ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ సినిమాలు బోల్తా కొట్టగా.. తాప్సీ చిత్రం మరింత డిజాస్టర్ గా మిగిలేలా ఉంది. 

తొలి రోజు రూ. 72 లక్షల కలెక్షన్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు మరో 70 లక్షలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం 370 స్క్రీన్ల లోనే విడుదలైంది. విమర్శకుల నుంచి ప్రశంసలు లభించినప్పటికీ చాలా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కేవలం 2-3 శాతం ఆక్యుపెన్సీతో దొబారా నడుస్తోందని, చాలా షోలు రద్దవుతున్నాయని ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు సుమిత్ కడెల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో దూసుకెళ్తున్న తాప్సీ కెరీర్లో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలేలా కనిపిస్తోంది.