Team India: అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన ఆల్​ రౌండర్​ హుడా

  • అతను అరంగేట్రం తర్వాత ఆడిన 16 మ్యాచ్ ల్లో భారత్ గెలుపు
  • ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా దీపక్ హుడా ఘనత
  • 15 విజయాలతో ఉన్న రొమేనియా ఆటగాడి రికార్డు బద్దలు
Deepak Hooda Sets Unique World Record

టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా భారత జట్టుకు లక్కీ చార్మ్ గా మారాడు. అతను ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధిస్తోంది. తను కూడా బ్యాట్‌తోపాటు బంతితోనూ సత్తా చాటుతూ జట్టు విజయాల్లో  కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హుడా జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో  వన్డేలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులతో పాటు ఒక వికెట్‌ పడగొట్టాడు. దాంతో, ఈ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 2-0 తో సొంతం చేసుకుంది. 

ఈ విజయంతో దీపక్ హుడా ఓ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు.  క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. హుడా ఇప్పటి వరకు 9 టీ20లు, 7వన్డేల్లో పోటీ పడ్డాడు. వీటిలో టీమిండియా గెలిచింది. దాంతో అం‍తర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 16  విజయాలు సాధించిన ఆటగాడిగా హుడా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రొమేనియా ఆటగాడు సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. నడిగోటియా అరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్‌ల్లో  గెలిచింది. తాజా మ్యాచ్‌లో విజయంతో నడిగోటియా ప్రపంచ రికార్డును హుడా బద్దలు కొట్టాడు. దాంతో, హుడా ఇప్పుడు టీమిండియాకు అదృష్టంగా మారిపోయాడని చెప్పొచ్చు.

More Telugu News