కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలే: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

20-08-2022 Sat 20:59
  • విప‌క్షాల ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి శూన్య‌మ‌న్న రాజ‌గోపాల్ రెడ్డి
  • అభివృద్ధిపై చ‌ర్చించేందుకూ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని కేసీఆర్‌పై ఆరోప‌ణ‌
  • బీజేపీకి ఓటేస్తే మీట‌ర్లు రావ‌ని వెల్ల‌డి
komatireddy rajagopal reddy fires on kcr comments in munugody meeting
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ శ‌నివారం నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయ‌న‌ మండిపడ్డారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అపాయింట్‌మెంట్‌ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలేన‌న్న రాజ‌గోపాల్ రెడ్డి.. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 

రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా చేశారో అప్పుడే కేసీఆర్‌ పతనం మొదలైందని కోమ‌టిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని, కేసీఆర్‌ అహంకారం వల్లే ఈ ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని అన్నారు. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్న కేసీఆర్‌ మాటలు అసత్యాలని ఆయ‌న‌ అన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు మోపుతున్నారని కోమ‌టిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.