అప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు.. అంటూ ఏడ్చేసిన చార్మీ!

20-08-2022 Sat 18:49
  • ప్రమోషన్స్ లో 'లైగర్' టీమ్ 
  • పాండమిక్ ఇబ్బందిపెట్టిందన్న చార్మీ 
  • ఓటీటీ ఆఫర్ ను పూరి తిరస్కరించాడంటూ వివరణ 
  • విజయ్ దేవరకొండ అండగా నిలిచాడంటూ ఉద్వేగానికి లోనైన చార్మీ   
Charmi Interview
కథానాయికగా వరుస అవకాశాలు వస్తుండగానే, పూరితో కలిసి సినిమాల నిర్మాణంపై చార్మీ ఆసక్తిని కనబరించింది. చాలా కాలంగా పూరి సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఆమె 'లైగర్' సినిమాకి సంబంధించి పూరి - విజయ్ దేవరకొండలను ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమా నిర్మాణ సమస్యలను ప్రస్తావించింది. 

ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తరువాత ఫస్టు లాక్ డౌన్ పడిందనీ, ఆ తరువాత సెకండ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ ను కూడా చూశామని చెప్పింది. ఆ సమయంలో తమ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని అంది. అలాంటి పరిస్థితుల్లో ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని చెప్పింది. అయితే అందుకు పూరి ఒప్పుకోలేదని అంది. 

ఆ సమయంలో అంత పెద్ద ఆఫర్ ను వదులుకునే దమ్ము ఒక్క పూరికి మాత్రమే ఉందని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో తమకి అండగా నిలిచింది ఈ సినిమా కంటెంట్ ... విజయ్ దేవరకొండ మాత్రమే" అంటూ చెబుతూ చార్మీ ఏడ్చేసింది. ఈ సినిమా కోసం ఆమె చాలా సార్లు ఏడ్చిందంటూ పూరి ఉద్వేగానికి లోనుకాగా, భారమైన మనసుతో విజయ్ దేవరకొండ అలా చూస్తుండిపోయాడు.