మునావర్ ఫారూఖీ షోకు క్యూ క‌ట్టిన హైద‌రాబాదీలు.. ఫొటో ఇదిగో

20-08-2022 Sat 17:51
  • శిల్ప క‌ళావేదిక కేంద్రంగా మునావర్ షో
  • హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రుస్తాడ‌ని ఫారూఖీపై ఆరోప‌ణ‌లు
  • చివ‌రి నిమిషంలో అనుమ‌తి ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు
  • నిర్ణీత‌ స‌మ‌యానికంటే ముందుగా త‌ర‌లివచ్చిన న‌గ‌ర‌వాసులు
hyderabadis ques at Shilpakala Vedika for Munawar Faruqui show
స్టాండ‌ప్ కామెడీలో చేయి తిరిగిన మునావర్ ఫారూఖీ షోకు హైద‌రాబాదీలు క్యూ క‌ట్టారు. త‌న స్టాండ‌ప్ కామెడీ షోల్లో హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేస్తారంటూ మునావర్ ఫారూఖీపై ఆరోప‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో అత‌డి షోకు ముందుగా తెలంగాణ స‌ర్కారు అనుమ‌తి ఇవ్వ‌లేదు. షోకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉంద‌న‌గా... హైద‌రాబాద్ పోలీసుల నుంచి అనుమ‌తి సంపాదించిన మునావర్... ఆదివారం సాయంత్రం 5.30 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు న‌గ‌రంలోని శిల్ప క‌ళావేదిక‌లో త‌న షోను నిర్వ‌హించ‌నున్నారు.

ఇప్ప‌టికే పెద్ద ఎత్తున రచ్చ జ‌రిగిన ఈ షోకు న‌గ‌ర వాసులు పోటెత్తారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన హైదరాబాదీలు... షో మొద‌లు కావ‌డానికి ముందే శిల్ప క‌ళావేదిక వ‌ద్ద క్యూ క‌ట్టారు. మునావర్ షోను అడ్డుకుంటామ‌ని బీజేపీ నేత‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో శిల్ప క‌ళావేదిక ప‌రిస‌రాల్లో వేలాది మంది పోలీసులు ప‌హారా కాస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ న‌గ‌ర‌వాసులు మునావర్ షో ప‌ట్ల అమితాస‌క్తి క‌న‌బ‌రచారు.