38 ఓవ‌ర్ల‌కే కుప్ప‌కూలిన జింబాబ్వే... టీమిండియా టార్గెట్ 162 ప‌రుగులు

20-08-2022 Sat 16:02
  • ఇప్ప‌టికే తొలి వ‌న్డేను గెలిచిన టీమిండియా
  • 161 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన జింబాబ్వే జ‌ట్టు
  • శార్దూల్ ఠాకూర్‌కు 3 వికెట్లు
wer indies all out in 38 overs for 161 runs
జింబాబ్వే టూర్‌లో టీమిండియా స‌త్తా చాటుతోంది. ఆతిథ్య జ‌ట్టుతో 3 వ‌న్డేల‌తో కూడిన వ‌న్డే సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి వ‌న్డే నెగ్గిన భార‌త జ‌ట్టు శ‌నివారం నాటి రెండో వ‌న్డేలోనూ అత్య‌ల్ప స్కోరుకే జింబాబ్వే జ‌ట్టును ఆలౌట్ చేసింది. 50 ఓవ‌ర్ల ఇన్నింగ్స్‌లో కేవ‌లం 38.1 ఓవ‌ర్ల‌కే జింబాబ్వే జ‌ట్టు ఆలౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. భార‌త బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 161 పరుగుల‌కే జింబాబ్వే జ‌ట్టు చాప చుట్టేసింది. 

టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... అత‌డు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని భార‌త బౌల‌ర్లు నిరూపించారు. భార‌త్ త‌ర‌ఫున ఆరుగురు బౌల‌ర్లు బౌలింగ్ చేయ‌గా... అంద‌రూ అతి త‌క్కువ ప‌రుగులే ఇచ్చారు. భార‌త బౌల‌ర్ల ధాటికి జింబాబ్వే బ్యాట‌ర్లు ప‌రుగులు తీసేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. 

దీప‌క్ చాహ‌ర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన శార్దూల్ ఠాకూర్ మిగిలిన బౌల‌ర్ల కంటే కాస్తంత ఎక్కువ ప‌రుగులు ఇచ్చినా... 3 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. ఇక హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఓవ‌ర్‌కు 2 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ప‌రుగులు క‌ట్ట‌డి చేయ‌డంలో స‌త్తా చాటాడు. మ‌రికాసేప‌ట్లో టీమిండియా జ‌ట్టు 162 ప‌రుగుల విజయ ల‌క్ష్యంతో త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.