Team India: జింబాబ్వేతో రెండో వన్డే: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్ కు దీపక్​ చహర్ దూరం

India Opt To Bowl First Against Zimbabwe in 2nd ODI  Deepak Chahar Misses Out
  • తొలి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన పేసర్
  • రెండో మ్యాచ్ తుది జట్టులో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్
  • రెండు మార్పులతో బరిలోకి ఆతిథ్య జింబాబ్వే    
జింబాబ్వేతో రెండో వన్డేలో భారత జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన దీపక్ చహర్ ఈ మ్యాచ్ లో లేకపోవడం చర్చనీయాంశమైంది. దీపక్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నట్టు టాస్ టైమ్ లో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ తెలిపాడు. దీపక్ ను తప్పించిన కారణాలను మాత్రం చెప్పలేదు. అయితే, చిన్న గాయం వల్లే దీపక్ దూరం అయ్యాడని తెలుస్తోంది. 

మరోవైపు తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తూ ముంజేయి నొప్పితో ఇబ్బంది పడ్డ శిఖర్ ధావన్ కోలుకున్నాడు. దాంతో, అతను ఈ మ్యాచ్ లోనూ బరిలోకి దిగాడు. ఇక, రెండో మ్యాచ్ కోసం తమ తుది జట్టులో ఆతిథ్య జింబాబ్వే రెండు మార్పులు చేసింది. మరుమని, ఎన్గరవను తప్పించి వారి స్థానాల్లో కైటనో, చివంగాను తీసుకుంది. 

హరారే మైదానంలోనే గురువారం జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్ కు బ్యాటింగ్ రాలేదు. గాయం నుంచి కోలుకొని దాదాపు రెండు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్ ఎలా ఆడతాడని అందరిలో ఆసక్తి ఉంది. ఈ నెలలోనే ఆసియా కప్, అక్టోబర్ లో టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో తను త్వరలోనే ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. కాబట్టి రెండో వన్డేలో టాస్ నెగ్గితే తను బ్యాటింగ్ ఎంచుకుంటాడని ఆశిస్తే.. మళ్లీ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే, ఛేదనలో అతను ఓపెనర్ గా వస్తాడో.. ధావన్, గిల్ లతోనే ఓపెనింగ్ చేయిస్తాడో చూడాలి.
Team India
deepak chahar
zimbambwe
2nd ODI

More Telugu News