Narendra Modi: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్.. సస్పెన్షన్ ​

  • అనుచిత వ్యాఖ్యలు చేసిన కాన్పూర్ క్రైం  బ్రాంచ్ కానిస్టేబుల్ అజయ్ గుప్తా
  • ట్వీట్లు, రీట్వీట్ల  స్క్రీన్ షాట్స్  వైరల్  అవడంతో ఖాతా డిలీట్
  • విషయం తెలిసి అతడిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 
Kanpur Crime Branch constable suspended for indecent remarks against PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ, మహిళా ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఘటన కాన్పూర్లో చోటు చేసుకుంది. కాన్పూర్ క్రైం బ్రాంచ్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న అజయ్ గుప్తా ట్విట్టర్‌లో ప్రధానితో పాటు మహిళా ఐఎఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద ట్వీట్లు చేసి వాటికి సమాధానం కూడా ఇచ్చాడు.  

వీటికి సంబంధించిన  స్క్రీన్‌ గ్రాబ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అధికారులు గుర్తించి విచారణకు ఆదేశించారు. కాన్పూర్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తించి, ఆ తర్వాత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది.

అజయ్ గుప్తా చాలా కాలంగా కమిషనరేట్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 14న పోలీసు పతకాలను ప్రకటించగా.. పతక జాబితాకు సంబంధించి అజయ్ గుప్తా సోషల్ మీడియాలో కమిషనరేట్ అధికారులు, డీజీపీని ప్రశ్నించాడు. దీనిపై కమిషనరేట్ పోలీసులు సమాధానం ఇచ్చారు. 

ఈలోగా అజయ్ పాత ట్వీట్లు బయటపడ్డాయి. వీటిపై స్పందించిన అతను ప్రధానిపైనా, మహిళా ఐఏఎస్‌ అధికారిపైనా అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తన ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలియడంతో అజయ్ తన ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే వివాదాస్పద ట్వీట్ స్క్రీన్‌షాట్స్, యూఆర్‌ఎల్‌లను అధికారులు సేవ్ చేశారు. విచారణ తర్వాత అడిషనల్ సీపీ ఆనంద్ కులకర్ణి అతడిని సస్పెండ్ చేశారు. 

ఈ విషయంపై పోలీస్ కమీషనర్  జోగ్‌దండ్ మాట్లాడుతూ.. ‘ఒక కానిస్టేబుల్ సోషల్ మీడియాలో తన  హద్దులు దాటి కొన్ని పోస్ట్‌లు పెట్టాడు. ఇది పోలీసు ఉద్యోగం కాబట్టి  మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది మా ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించడమే కాబట్టి మేము అతనిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించాము’ అని ప్రకటించారు.

More Telugu News