తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లాడాలని బలవంతం.. కాదన్నందుకు యువతికి గుండు గీసి దురాగతం!

20-08-2022 Sat 08:38
  • పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన
  • దంతవైద్యం చివరి సంవత్సరం చదువుతున్న యువతి
  • పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చిన క్లాస్‌మేట్ తండ్రి
  • నిరాకరించినందుకు చిత్రహింసలు
  • వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు 
Pak lawyers thrash man who sexually assaulted medical student in Punjab province
పొరుగుదేశం పాకిస్థాన్‌లో దారుణాలకు అంతూపొంతు లేకుండాపోతోంది. తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లాడేందుకు నిరాకరించిన ఓ వైద్య విద్యార్థినిపై అమానుషంగా ప్రవర్తించారు. గుండుగీసి, కనుబొమలు తొలగించారు. ఆపై లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన పాకిస్థాన్ వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండ్ అవుతోంది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌కు చెందిన బాధితురాలు ఖతీజా మహమూద్ దంతవైద్యం చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె సోదరులు యూకే, ఆస్ట్రేలియాలో ఉండగా, వృద్ధురాలైన తల్లితో కలిసి నివసిస్తోంది. తన క్లాస్‌మేట్ అయిన అన్నాతో బంధుత్వం కూడా ఉంది. ఈ క్రమంలో వారింటికి వెళ్లి వస్తుండేది.

వ్యాపారవేత్త అయిన అన్నా తండ్రి షేక్ డానిష్‌.. ఖతీజా వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. తన తండ్రి వయసున్న అతడిని చేసుకునేందుకు బాధితురాలు నిరాకరించింది. ఇదే విషయాన్ని అన్నాతో చెప్పింది. అది విన్న అన్నా ఆగ్రహంతో ఊగిపోయింది.

ఇదిలా ఉండగా, ఈ నెల 8న బాధితురాలు ఖతీజా సోదరుడు యూకే నుంచి వచ్చాడు. విషయం తెలిసిన డానిష్ మరో 14 మందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అందుకు బాధిత యువతి సోదరుడు కూడా నిరాకరించడంతో అక్కడే వారిపై దాడిచేశారు.

అనంతరం వారిద్దరినీ బలవంతంగా డానిష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మరోమారు ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. ఆపై ఖతీజాకు గుండు గీయించి, కనుబొమలు తొలగించారు. అక్కడితో ఆగకుండా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లిన డానిష్.. ఆమెను లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఖతీజాతో అన్నా బూట్లు నాకించారు. ఈ మొత్తం ఘటనను అతడి అనుచరులు వీడియో తీశారు. 

గురువారం ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రధాన నిందితుడు డానిష్, ఆయన కుమార్తె అన్నాతోపాటు మొత్తం 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు కోర్టుకు తీసుకురాగా లాయర్లు వారిపై దాడిచేశారు. బూట్లు విసిరారు. వారి దాడి నుంచి నిందితులను రక్షించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. #Justiceforkhatija హ్యాష్‌ట్యాగ్‌ పాక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.