పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత

20-08-2022 Sat 08:04
  • పలు తెలుగు సినిమాల్లో నటించిన నమిత
  • ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడి
  • 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో వివాహం
Actress Namitha delivers twin boys
సొంతం, జెమిని, సింహా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ సినీనటి నమిత కవలలకు జన్మినిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఆమె ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు. 

భర్తతో కలిసి కవలలను ఎత్తుకున్న నమిత ఆ వీడియోలో మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు తమతో ఉంటాయన్నారు. ఇకపైనా అవి కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిశువులు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. 

నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నవంబరు 2017లో నమిత వివాహం చేసుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వారి వివాహం జరిగింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి