వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి అనుమానాస్పద మృతి

20-08-2022 Sat 06:42
  • తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీ నేత
  • సోషల్ మీడియాలో ఆత్మహత్య అని ప్రచారం 
  • అపార్ట్‌మెంట్‌లో పరిస్థితులు అలా లేవంటున్న స్థానికులు
YCP MLA Kapu Ramachandra Reddy son in law died
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఉన్న 101 నంబరు ఫ్లాటుకు ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. మూడురోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. సోషల్ మీడియాలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే, అక్కడి పరిస్థితులు మాత్రం అలా లేవని, ఆయన మృతి అనుమానాస్పదంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. 

మంజునాథరెడ్డిది అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీ నేత. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని. విషయం తెలిసిన వెంటనే ఆయన విజయవాడ చేరుకున్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు. 101 నంబరు ఫ్లాటు బాధ్యతలను చూసే నరేంద్రరెడ్డి నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఫ్లాట్‌లోకి వెళ్లారని, ఆ తర్వాత కాసేపటికే అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 

మంజునాథరెడ్డి పడిపోయాడని నరేంద్రరెడ్డి పిలవడంతో అంబులెన్స్‌లో ఎక్కించేందుకు తాము వెళ్లినట్టు పేర్కొన్నారు. మంచం పక్కనే ఆయన కిందపడుకుని ఉన్నట్టు కనిపించారని, అయితే ఆయన అప్పటికే చనిపోయారా? లేదా? అన్న విషయం తమకు తెలియదని అన్నారు. మంజునాథరెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో ఉంది.