కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా ప‌ద‌వీ కాలం ఏడాది పొడిగింపు

19-08-2022 Fri 21:41
  • ఇటీవ‌లే కేబినెట్ కార్య‌ద‌ర్శి గౌబ‌కు పొడిగింపు ఇచ్చిన కేంద్రం
  • 2019 ఆగ‌స్టు నుంచి కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా భల్లా
  • 2023 ఆగస్టు 22 దాకా ప‌ద‌విలో కొన‌సాగనున్న అజ‌య్‌
కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌క స్థానాల్లో ఉన్న ఇద్ద‌రు అధికారుల‌కు ప‌ద‌వీ కాలం పొడిగిస్తూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ‌రుస నిర్ణ‌యాలు తీసుకుంది. ఇప్ప‌టికే కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ హోదాలో ఉన్న రాజీవ్ గౌబ ప‌ద‌వీ కాలాన్ని ఇటీవ‌లే ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం తీసుకున్న రోజుల వ్య‌వ‌ధిలోనే కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న అజ‌య్ భ‌ల్లా ప‌ద‌వీ కాలాన్ని కూడా కేంద్రం పొడిగించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర నియామ‌కాలు, శిక్ష‌ణా వ్య‌వ‌హారాల శాఖ (డీఓపీటీ) ఉత్త‌ర్వులు జారీ చేసింది.

1984 కేడ‌ర్ ఐఏఎస్ అధికారి అయిన భ‌ల్లా అసోం, మేఘాల‌య కేడ‌ర్‌కు చెందినవారు. 2019 ఆగ‌స్టులో ఆయ‌న కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ‌రో మూడు రోజుల్లో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ క్రమంలో కేంద్రం ఆయన సర్వీసును ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపుతో 2023 ఆగ‌స్టు 22 వ‌ర‌కు హోం శాఖ కార్య‌ద‌ర్శిగా భ‌ల్లా కొన‌సాగ‌నున్నారు.