ముంబై ఫొటో ఎగ్జిబిష‌న్‌కు ఎంపికైన ఏపీ మంత్రి రోజా ఫొటో ఇదే!

19-08-2022 Fri 20:16
  • ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ప‌తాకంతో రోజా
  • ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన ముంబైలో ఫొటో ఎగ్జిబిష‌న్‌
  • 75 ఫొటోల్లో రోజా ఫొటో కూడా ఒక‌టిగా ప్ర‌ద‌ర్శించిన వైనం
  • సంతోషం వ్య‌క్తం చేసిన ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి
ap minister rk rojas photo selected for mumbai photo exibition
అంత‌ర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురేను స్మ‌రించుకుంటున్నాం క‌దా. అదే సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో అద్భుత‌మైన ఫొటోల‌తో ఎగ్జిబిష‌న్లు కూడా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ముంబైలో శుక్ర‌వారం జరిగిన ఫొటో ఎగ్జిబిష‌న్‌లో అద్భుత‌మైన ఫొటోలుగా గుర్తించిన 75 ఫొటోల‌ను నిర్వాహ‌కులు ప్ర‌ద‌ర్శించారు. 

ఈ ఎగ్జిబిష‌న్‌లో ఏపీకి చెందిన ఓ ఫొటో కూడా ప్ర‌దర్శిత‌మైంది. అది ఓ ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌రే తీసినా... అందులో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ప‌తాకాన్ని ప‌ట్టుకున్న ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. వేదిక చుట్టూ వందలాది మంది ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్ మనిపిస్తుండగా.. వేదిక‌పై ఆమె ఒక్క‌రే ఆ జెండాను రెప‌రెప‌లాడిస్తూ క‌నిపిస్తున్నారు. ఈ ఫొటో ముంబై ఫొటో ఎగ్జిబిష‌న్‌కు ఎంపికైనందుకు త‌న‌కు ఎంతో సంతోషంగా ఉందంటూ రోజా ఆనందం వ్య‌క్తం చేశారు.