నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

19-08-2022 Fri 20:00
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన నితీశ్ కుమార్
  • వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో అత్యవసరంగా ల్యాండింగ్
  • గయ నుంచి పాట్నాకు రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం
Nitish Kumar helicopter had emergency landing
బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవలే ఎనిమిదో సారి నితీశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, సమీక్షలకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈరోజు ఔరంగాబాద్, జెహానాబాద్, గయ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేస్తుండగా... వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. 

దీంతో నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్టు మగద్ రేంజ్ ఐజీ వినయ్ కుమార్ తెలిపారు. అక్కడి నుంచి పాట్నాకు రోడ్డు మార్గంలో వెళ్లారని చెప్పారు. మరోవైపు రానున్న రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.