'జగన్ రోడ్లు- నరకానికి దారులు'.. ఏపీ రోడ్ల‌పై బీజేపీ ప్ర‌చారం షురూ

19-08-2022 Fri 19:40
  • ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ, జ‌న‌సేన ప్ర‌చారం
  • తాజాగా ఆ బాధ్య‌త‌ను తీసుకున్న బీజేపీ
  • సోష‌ల్ మీడియా వేదికగా కార్టూన్‌లతో ప్ర‌చారం మొద‌లెట్టిన క‌మ‌ల‌నాథులు
ap bjp starts its campaign on ap roads
ఏపీలో ర‌హ‌దారుల దుస్థితిపై ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా వినూత్న నిర‌స‌న‌ల‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభ‌మైన జ‌న‌సేన ప్ర‌చారం ఇంకా కొన‌సాగుతుండ‌గా... ఏపీలో ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై ప్ర‌చారం మొద‌లుపెట్టింది. జ‌న‌సేన మాదిరే కార్టూన్ల‌తో బీజేపీ త‌న ప్ర‌చారానికి శ్రీకారం చుట్టింది.

శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ ఓ సెటైరిక‌ల్ కార్టూన్‌ను సంధించింది. 'జగన్ రోడ్లు- నరకానికి దారులు' పేరిట మొద‌లుపెట్టిన ఈ ప్ర‌చారంలో భాగంగా 'వైసీపీ ప్ర‌భుత్వ సిత్రాలు... రాష్ట్ర రోడ్లు' అంటూ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది. ఈ కార్టూన్‌ లో విజ‌య‌వాడ‌కు 5 కిలో మీట‌ర్ల దూరంలో కారులో వెళుతున్న ఓ వ్య‌క్తి.. రోడ్డు ప‌క్క‌గా కూర్చుని మద్యం తాగుతున్న ఓ వ్య‌క్తిని 'ఈ రోడ్డు ఎక్క‌డికి వెళుతుంది' అని ప్ర‌శ్నిస్తాడు. ఆ ప్ర‌శ్న‌కు ఏమాత్రం త‌డుముకోకుండా... 'ఏముంది?  డైరెక్ట్‌గా పైకే' అంటూ స‌మాధానం ఇస్తాడు. అంతేకాకుండా 'ఈ రోడ్డు ఎక్క‌డికి పోతుందో తెలియ‌దు గానీ... నీ కారేమో షెడ్డుకు, నువ్వేమో హాస్పిట‌ల్‌కి మాత్రం ప‌క్కాగా వెళ‌తారు' అంటూ సెటైర్ సంధిస్తాడు.