రాజాసింగ్ ను అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

19-08-2022 Fri 19:09
  • రేపు హైదరాబాద్ లో మునావర్ స్టాండప్ కామెడీ షో
  • షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు
  • షోను వ్యతిరేకిస్తున్న బీజేపీ శ్రేణులు
Police arrested BJP MLA Raja Singh
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించడంతో... ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు మునావర్ హైదరాబాద్ కు వస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఆయన స్టాండప్ కామెడీ షో జరగనుంది. షోకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో సంస్థ అమ్మింది. ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. 

మరోవైపు తన కామెడీ షోలో హిందూ దేవతలను మునావర్ అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన షోను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆ షోకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ డీజీపీని బీజేవైఎం నేతలు కూడా కలిశారు. అయినప్పటికీ ఈ షోకు అనుమతులు లభించాయి. మరో విషయం ఏమిటంటే మునావర్ షోపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.