ఫొటోగ్రాఫ‌ర్ల‌ను వ‌రుస‌గా నిల‌బెట్టి ఫొటో తీసిన బండి సంజ‌య్‌... ఫొటోలు ఇవిగో

19-08-2022 Fri 18:54
  • ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో సాగుతున్న బండి సంజ‌య్‌
  • చీట‌కోడూరులో ఫొటోగ్రాఫ‌ర్ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన వైనం
  • ఫొటోగ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని కితాబు
bjp telangana chief bandi sanjay clicks photographers with camera
శుక్ర‌వారం అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ‌కీయ నేత‌ల్లో చాలా మంది త‌మ చేతుల్లోకి కెమెరాలు తీసుకుని క్లిక్‌మ‌నిపించారు. ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా త‌నలోని ఫొటోగ్రాఫ‌ర్‌ను బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌స్తుతం ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో భాగంగా మూడో ద‌శ‌ను కొన‌సాగిస్తున్న సంజ‌య్‌... జ‌న‌గాం జిల్లాలో సాగుతున్నారు. 

ఈ క్ర‌మంలో శుక్రవారం జిల్లాలోని చీట‌కోడూరు గ్రామం వ‌ద్ద ఏర్పాటు చేసిన త‌న పాదయాత్ర శిబిరానికి వ‌చ్చిన ఫొటోగ్రాఫ‌ర్ల‌తో సంజ‌య్ స‌ర‌దాగా గ‌డిపారు. ఓ ఫొటోగ్రాఫ‌ర్ కెమెరాను చేతిలోకి తీసుకున్న సంజ‌య్‌... ఫొటోగ్రాఫ‌ర్లంద‌రినీ వ‌రుస‌గా నిల‌బెట్టి... తాను ఓ ఫొటోగ్రాఫర్ అవ‌తారం ఎత్తి ప‌లు ఫొటోలు తీశారు. 

ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంజ‌య్‌... 'ఈ సమాజంలో ఫొటోగ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివి. కరోనా సమయంలో వారి సేవలను మాటల్లో వర్ణించలేము. క్రిమినల్స్ ను పట్టుకోవడం లోనూ, ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోతోటే అది సాధ్యం' అంటూ ఓ కామెంట్‌ను జ‌త చేశారు.