కరోనా సోకిన రెండేళ్ల తర్వాత కూడా అనారోగ్య సమస్యల రిస్క్.. తాజా అధ్యయనంలో వెల్లడి

19-08-2022 Fri 15:42
  • ఇస్కెమెక్ స్ట్రోక్, మూర్ఛ వ్యాధుల ముప్పు
  • రెండేళ్ల తర్వాత కూడా కొందరు బాధితుల్లో గుర్తింపు
  • రెండు నెలల్లోనే తగ్గిపోతున్న ఆందోళన, డిప్రెషన్
  • లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడి
Risk of developing dementia brain fog remain even two years after contracting Covid19
కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న రెండేళ్ల తర్వాత కూడా దాని ప్రభావం మన ఆరోగ్యాలపై చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నరాల సంబంధిత, మానసిక సంబంధిత సమస్యలను లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి. 

డెల్టా వేరియంట్ తర్వాత ఇస్కెమెక్ స్ట్రోక్, ఎపిలెప్సీ (మూర్ఛ) కేసులు పెరిగిపోయినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. కాగ్నిటివ్ సమస్యలు, ఇన్సోమ్నియా, ఆందోళన సమస్యలను తమ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు గుర్తించారు. అయితే కరోనా వచ్చిన రెండు నెలల్లో ఆందోళన, డిప్రెషన్ సమస్యలు తగ్గడమే కాకుండా, రెండేళ్లలో పూర్తిగా నయం అవుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. 

కానీ, నరాల సంబంధిత సమస్యలు, డిమెన్షియా, మూర్ఛ రెండేళ్ల తర్వాత కూడా బాధితుల్లో కొనసాగుతున్నట్టు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, సైకియాట్రీ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ పాల్ హారిసన్ పేర్కొన్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ తర్వాతే ఈ సమస్యలు కనిపించినట్టు తెలిపారు. అయితే, ఈ సమస్యల తీవ్రత బాధితుల్లో ఏ మేరకు ఉంది? అవి ఎంత కాలం పాటు అలా కొనసాగొచ్చన్న అంశాలకు ఈ అధ్యయనంలో కవరేజీ ఇవ్వకపోవడం ఒక లోపంగా భావించొచ్చు.