దక్షిణ కొరియా అధ్యక్షుడివి పిల్ల చేష్టలు.. ఉత్తర కొరియా నియంత​ కిమ్ సోదరి యో జోంగ్​ కామెంట్​

19-08-2022 Fri 15:20
  • అణ్వాయుధాలను వదులుకుంటే ఆర్థిక సాయం చేస్తామన్న ఆఫర్ పై మండిపాటు
  • కేవలం తిండి కోసం ఎవరూ లక్ష్యాలను వదులుకోబోరని వ్యాఖ్య
  • దక్షిణ కొరియా అధ్యక్షుడు నోరు మూసుకోవాలని హెచ్చరిక
South Korea President comments childish says North Korean dictator Kims sister Yo Jong
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ వి అన్నీ పిల్ల చేష్టలని.. ఆయన నోరు మూసుకుని ఉంటే బాగుంటుందని దక్షిణ కొరియా నియంత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలను వదులుకుంటే ఆర్థిక సాయం చేస్తామంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్రకటించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనవి తెలిసీ తెలియని మాటలు అని.. ఆ ఆఫర్ అసంబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం తిండి కోసం ఎవరూ తమ లక్ష్యాలను వదలుకోబోరని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కొంచెం నోరుమూసుకోవాలని ఆమె హెచ్చరించారు.

దక్షిణ కొరియా ఆఫర్ పై కిమ్ యో జోంగ్‌ స్పందనను దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఖండించింది. కిమ్‌ సోదరి కామెంట్లు విచారకరమని పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసమే తాము ఈ ఆఫర్ చేశామని.. ఇది ఇప్పటికీ అందుబాటులోనే ఉందని పేర్కొంది.

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో
దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్‌ సుక్‌ యేల్‌ ఈ ఏడాది మే నెలలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలోనే దక్షిణ కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పుతానని.. అందుకోసం సాహసోపేతమైన ఆఫర్ ను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. 

ఇక బుధవారంతో యూన్ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా తన ఆఫర్ ను ప్రకటించారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే భారీగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇది ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని.. ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని ప్రకటించారు. దీనిపై ఉత్తర కొరియా నియంత సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా మండిపడ్డారు.