110 అడుగుల పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డు పట్టు.. వీడియో ఇదిగో

19-08-2022 Fri 14:52
  • అమెరికాలోని ఫ్లోరిడాలో నివసించే ఆశా మండేలా గిన్నిస్ రికార్డు
  • ఆధ్యాత్మిక మార్గంలో భాగంగా 40 ఏళ్లుగా జుట్టు పెంచుతూనే ఉన్నట్టు వెల్లడి
  • అది జుట్టు కాదని, తన కిరీటమని చెబుతున్న ఆఫ్రికన్ సంతతి మహిళ
Asha mandela the woman with worlds longest dreadlocks hair
ఇంతో అంతో పొడుగైన జుట్టు ఉన్న వాళ్లను చాలా మందిని చూసి ఉంటాం. అక్కడక్కడా తామెంత పొడవు ఉన్నారో అంత పొడవుతో వెంట్రుకలు ఉన్నవారూ కనబడతారు. కానీ అమెరికాలో నివసిస్తున్న ఓ ఆఫ్రికన్ సంతతి మహిళ మాత్రం ఏకంగా తన పొడవుకన్నా రెండు, మూడింతల పెద్ద జుట్టును పెంచి రికార్డు సృష్టించింది. ఏకంగా 110 అడుగుల పొడవైన డ్రెడ్‌ లాక్స్‌ ( వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా చిక్కు పడిన) జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్ లోకి ఎక్కింది. 

40 ఏళ్లుగా పెంచుతూనే..
  • అమెరికాలోని ఫ్లోరిడాలో నివసించే ఆశా మండేలా దాదాపు 40 ఏళ్లుగా జుట్టు కత్తిరించుకోకుండా పెంచుతూనే ఉంది. 
  • దాదాపు పదమూడేళ్ల కిందటే అంటే 2009లోనే ఆమె సుమారు 20 అడుగుల (ఆరు మీటర్లు) పొడవైన డ్రెడ్ లాక్స్ జుట్టుతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఆ తర్వాతా జుట్టు పెంచుకుంటూనే వచ్చిన ఆమెను ఇటీవల గిన్నిస్ బుక్ ప్రతినిధులు కలిశారు.  
  • ఈసారి కూడా ఆమె తన జుట్టు రికార్డును నమోదు చేయాలని ఆమె కోరడంతో.. జుట్టును కొలిచారు. ఈసారి జుట్టు పొడవు చూసి ఆశ్చర్యపోయారు. ఏకంగా 110 అడుగుల పొడవు (33.5 మీటర్లు) ఉన్నట్టు లెక్కించారు.
  • ఆమె ఇంత పొడవైన జుట్టును అలా మడత పెట్టేసుకుని తల వెనుక వస్త్రంతో కట్టేసుకుంటూ ఉంటుంది. ఇది కేవలం జుట్టు కాదని, తన కిరీటమని ఆశా మండేలా చెప్పడం గమనార్హం.
  • మరి ఇంతగా జుట్టు ఎందుకు పెంచావని అడిగితే.. ఆధ్యాత్మిక మార్గంలో భాగంగా పెంచుతున్నానని.. సుమారు 40 ఏళ్ల నుంచి జుట్టు కత్తిరించలేదని పేర్కొంది.
  • ఆమె తన జుట్టును ఒక్కసారి శుభ్రం చేసుకోవాలంటే ఐదారు షాంపూ బాటిళ్లు అవసరం పడతాయని.. ఆర బెట్టుకోవడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని తెలిపింది.