Nalgonda District: మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం బరిలో న‌లుగురు!

  • మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా
  • ఉప ఎన్నికలో తానే అభ్య‌ర్థినంటున్న పాల్వాయి స్ర‌వంతి
  • త‌మ‌కూ ఛాన్సుందంటున్న కైలాష్‌, కృష్ణారెడ్డి, ర‌వి
  • స‌ర్వే చేసి నిర్ణ‌యం తీసుకోవాల‌ని టీపీసీసీ నిర్ణ‌యం
  • వెంక‌ట్ రెడ్డికి అప్ప‌గించాలంటున్న సీనియ‌ర్లు
tpcc decides to finalise the munugodu candidate based on survey

న‌ల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే త‌న అభ్య‌ర్థి ఖ‌రారుపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి... టీఆర్ఎస్ అభ్య‌ర్థిని ఓడించి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నుంచి ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజగోపాల్ రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నిక‌ల్లో త‌న అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌న్న విష‌యంపై కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేక‌పోతోంది.

మరోపక్క, మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్థిని తానేనంటూ మాజీ మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతి చెప్పుకుంటున్నారు. అదే స‌మ‌యంలో త‌మ‌కూ అవ‌కాశాలు లేక‌పోలేద‌ని కైలాష్ నేత‌, చ‌ల్లా కృష్ణారెడ్డి, ప‌ల్ల ర‌విలు కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ న‌లుగురు అభ్య‌ర్థిత్వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని భావించింది. అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా స‌ర్వే నిర్వ‌హించి... స‌ర్వేలో ఎవ‌రికైతే విజ‌యావ‌కాశాలు ఉంటాయో వారికే టికెట్ ఇవ్వాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది.

ఇదిలా ఉంటే.. మునుగోడులో కోమ‌టిరెడ్డి ఫ్యామిలీకి మంచి ప‌ట్టు ఉందని, కోమ‌టిరెడ్డి సొంతూరు కూడా అందులోనే ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు చెబుతున్నారు. స‌ర్వేల మాటను ప‌క్క‌న పెట్టి... మునుగోడు ఉప బ‌రిలో అభ్య‌ర్థి ఎంపిక‌ను భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి అప్ప‌గించాలంటూ సీనియ‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని పార్టీ సీనియ‌ర్ నేత వి. హ‌న్మంత‌రావు శుక్ర‌వారం బ‌హిరంగంగానూ వెల్లడించారు.

More Telugu News