Graduate Chai Wali: ‘గ్రాడ్యుయేట్ చాయ్​ వాలీ’ ప్రియాంకకు సాయం చేసిన బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

Graduate Chai Wali gets her stall back after Dy CM Tejashwi Yadav help
  • పాట్నాలో ‘గ్రాడ్యుయేట్ చాయ్వాలీ’ టీ స్టాల్ ను తొలగించిన మున్సిపల్ అధికారులు
  • తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ ను కలిసి సాయం కోరిన ప్రియాంక
  • వెంటనే టీస్టాల్ ను పునరుద్ధరించిన మున్సిపల్ అధికారులు
‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరిట టీస్టాల్ నడుపుతూ పేరు తెచ్చుకున్న  ప్రియాంక గుప్తాకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సాయం చేశారు. పాట్నాలో  మున్సిపల్ అధికారులు తన టీస్టాల్ ను తొలగించడంతో సాయం కోసం ఆమె తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ను కలిసింది. వెంటనే స్పందించిన తేజస్వి ఆదేశాలతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తన స్టాల్ ను పునరుద్ధరించారని ప్రియాంక తెలిపింది.  

బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. అయితే నెలల తరబడి ప్రిపేర్ అవుతున్నా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో టీ అమ్మాలని నిర్ణయించుకుంది.‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరిట పాట్నా బోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది. లైగర్ హీరో విజయ్ దేవరకొండ, భోజ్‌పురి సినీ నటి అక్షర సింగ్ ఈ గుప్తా స్టాల్‌ని సందర్శించారు.

అయితే, రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా పాట్నా మున్సిపల్  కార్పొరేషన్ అధికారులు ప్రియాంకకు నోటీసులు ఇచ్చారు. స్టాల్ ను తొలగించవద్దని ఆమె అధికారులను వేడుకున్న వీడియో వైరల్ అయింది. నిబంధనల మేరకు డబ్బు డిపాజిట్ చేసి, తన దుకాణాన్ని తిరిగి తీసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను అభ్యర్థించానని, అయిప్పటికీ తన స్టాల్ ను తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ క్రమంలో తనకు సాయం చేయాలని లాలూ, తేజస్వి యాదవ్ లను కోరింది. తర్వాతి రోజే తన టీస్టాల్ ను పురుద్ధరించడంతో ప్రియాంక సంతోషం వ్యక్తం చేసింది. ఇక, టీ స్టాల్ తో తాను నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నానని ప్రజలు అంటున్నారని, కానీ, అంతే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయని గుప్తా చెప్పింది. మార్కెట్ పడిపోయినందున తాను అంత సంపాదించడం లేదని తెలిపింది.
Graduate Chai Wali
Bihar
patna
Tejashwi Yadav
Lalu Prasad Yadav
help

More Telugu News