CK Rauji: వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • 2002లో గుజరాత్ అల్లర్లు
  • బిల్కిస్ బానో అనే మహిళపై అత్యాచారం
  • ఆమె కుటుంబంలో ఏడుగురి హత్య
  • 11 మందికి జీవిత ఖైదు
  • తాజాగా క్షమాభిక్షతో అందరూ విడుదల
BJP MLA CK Rauji comments on Bilkis Bano rapists

గుజరాత్ లో 2002లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాదు, ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవితఖైదు పడింది. అయితే భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆ 11 మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించి, వారిని విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన వారిని పూలదండలతో స్వాగతం పలికారు. వారికి స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ లోని గోధ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే రావూజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వాళ్లు బ్రాహ్మణులని, సంస్కారం ఉన్నవారని పేర్కొన్నారు. రేపిస్టుల విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ కమిటీలో ఉన్న ఇద్దరు బీజేపీ నేతల్లో సీకే రావూజీ కూడా ఒకరు. వారు నేరానికి పాల్పడ్డారో లేదో తనకు తెలియదని రావూజీ అన్నారు. బ్రాహ్మణులు మంచి సంస్కార వంతులని అందరికీ తెలిసిందేనని, వాళ్లను ఎవరైనా ఈ కేసులో ఇరికించి ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పైగా, వాళ్లు జైల్లో తమ సత్ప్రవర్తనతో ఆకట్టుకున్నారని వెల్లడించారు. 

అటు, ఈ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రేపిస్టులను పూలదండలతో సత్కరించారని, వాళ్లను యుద్ధ వీరులుగా, స్వాతంత్ర సమరయోధుల్లా భావిస్తున్నారని విమర్శించారు. జాతి సామూహిక మనస్సాక్షికి ఇదొక మచ్చ అని పేర్కొన్నారు. ఇవాళ బిల్కిస్ బానోకి జరిగిందే రేపు మనలో ప్రతి ఒక్కరికీ జరగొచ్చని, ఇకనైనా భారత్ గొంతువిప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ అభిప్రాయాలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సమర్థించారు. దేశ ప్రజలు ఇకనైనా గళం విప్పాలని, పౌరులుగా మనం ఈ తిరోగమన వ్యవస్థకు మౌన వీక్షకులుగా ఉండరాదని తెలిపారు.

More Telugu News