మహిళలను కించపరిచిన బాలకృష్ణపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?: రోజా

18-08-2022 Thu 15:27
  • తమ ప్రభుత్వంపై నారా లోకేశ్ విషం చిమ్ముతున్నారన్న రోజా 
  • రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదంటే కంటి వైద్యుడిని కలవాలని సలహా 
  • రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీనేనని మంత్రి ధీమా 
Why Chandrabadu does not take action on Balakrishna says Roja
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని మంత్రి రోజా అన్నారు. అవినీతికి తావు లేకుండా, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జగన్ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై నారా లోకేశ్ విషం చిమ్ముతున్నారని... ఆయనకు అభివృద్ధి కనపడలేదంటే నేత్ర వైద్యుడిని కలవాలని సూచించారు. ఇచ్చిన హామీలన్నింటిని జగన్ తీరుస్తున్నారని చెప్పారు. 

ఇదే సమయంలో బాలకృష్ణపై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి గతంలో ఆయన ఎన్నో మాట్లాడారని... ఆయనపై అప్పట్లో చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగారు. అమావాస్యకో, పౌర్ణమికో ఒకసారి వచ్చి బాలకృష్ణ మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలు ఏపీ వైపు చూస్తుంటే... టీడీపీ మాత్రం ప్రభుత్వంపై బురదచల్లే పని చేస్తోందని విమర్శించారు.