దమ్ముంటే రా.. తేల్చుకుందాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి దశమంతరెడ్డి సవాల్

18-08-2022 Thu 12:14
  • నిన్న బండి సంజయ్ కి సవాల్ విసిరిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
  • బండి సంజయ్ కి సవాల్ విసిరేంత స్థాయి నీకు లేదన్న దశమంతరెడ్డి
  • కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఫామ్ హౌస్ కు రోడ్డు వేయించుకున్నావని మండిపాటు
Dashamantha Reddy challenges Muthireddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంతరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసురుతూ జనగామలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగుల నేపథ్యంలో దశమంతరెడ్డి స్పందిస్తూ... బండి సంజయ్ కు సవాల్ విసిరేంత స్థాయి నీకు లేదని అన్నారు. 

దమ్ముంటే రా... జనగామ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద మనిద్దరం తేల్చుకుందామని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జనగామకు నీవు తెచ్చిన నిధులపై చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో నీ ఫామ్ హౌస్ కు రోడ్డు వేయించుకున్నావని ఆరోపించారు. నీతి ఆయోగ్ అంటే ఏమిటో నీకు తెలుసా? అని ప్రశ్నించారు. హోర్డింగులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.