మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్

18-08-2022 Thu 11:56
  • వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారన్న జవహర్  
  • ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శ 
  • ఉద్యోగులు పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని సలహా 
Jawahar fires on Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోసకారి అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారని... ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీపీఎస్ పై చర్చిద్దాం రమ్మంటూ ఉద్యోగులకు ఆహ్వానం పలకడం కేవలం కాలయాపన చేయడానికే అని మండిపడ్డారు. మూడున్నరేళ్లు ఏమార్చిన ముఖ్యమంత్రికి... మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. చర్చల పేరుతో మరో మోసానికి తెరదీశారని చెప్పారు. 

ఉద్యోగ సంఘాల నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని జవహర్ తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలను మాత్రమే చర్చలకు పిలుస్తున్నారని విమర్శించారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారడం బాధాకరమని చెప్పారు. డీఏలు ఈనాటికీ జమ కాకపోవడం ఉద్యోగుల పరిస్థితికి నిదర్శనమని అన్నారు. పీఆర్సీ బకాయిల గురించి ఉద్యోగులు పోరాడాలని... పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.