జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులకు కూడా ఓటు హక్కు.. బీజేపీ ఓటర్లను దిగుమతి చేసుకుంటుందంటూ ప్రతిపక్షాల విమర్శలు

18-08-2022 Thu 10:11
  • ఉద్యోగులు, విద్యార్థులకు, కార్మికులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం
  • సాయుధ బలగాల్లోని స్థానికేతరులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్న సీఈవో
  • ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న మెహబూబా ముఫ్తీ
Non locals in JK get voting rights
జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులకు కూడా ఓటు హక్కు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికి బీజేపీకి లబ్ధి చేకూర్చే పనేనని ఆరోపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న స్థానికేతరులైన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహా అక్కడ నివసించే స్థానికేతరులకు ఓటు హక్కు కల్పించాలని ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) హిర్దేశ్ కుమార్  నిర్ణయించారు.

ఓటు హక్కు కోసం వీరందరూ దరఖాస్తు చేసుకుని జమ్మూకశ్మీర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. వారందరూ ఇక్కడే ఉండాలన్న నియమం ఏమీ లేదని, కాబట్టి ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, జమ్మూకశ్మీర్‌లో సేవలందిస్తున్న సాయుధ భద్రతా బలగాల్లోని స్థానికేతరులు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

అయితే, ఈసీ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు, బీజేపీ అనుకూల ఓటర్ల సంఖ్యను పెంచడమే ఇందులో భాగమని ముఫ్తీ విమర్శించారు. స్థానికేతరులకు ఓటుహక్కు కల్పిస్తే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నారు. బీజేపీ అనుకూల ఓటర్లను ‘దిగుమతి’ చేసుకునేందుకు ప్రభుత్వం కావాలనే ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులను నిర్వీర్యం చేసి ఉక్కు పిడికిలితో పాలించడమే దీని వెనకున్న లక్ష్యమని ముఫ్తీ ఆరోపించారు.