New Delhi: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల.. ఢిల్లీ ఫస్ట్

  • నివేదిక విడుదల చేసిన హెచ్ఈఐ
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను దాటేసిన పలు నగరాలు
  • పీఎం 2.5 కారణంగా బీజింగ్‌లో అత్యధిక మరణాలు
  • ఆ తర్వాత ఢిల్లీలోనే ఎక్కువ.. 14వ స్థానంలో ముంబై
  • ప్రపంచవ్యాప్తంగా 2.6 బిలియన్ల మందిపై ప్రభావం
Delhi tops list of worlds most polluted cities

ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా కోల్‌కతా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (హెచ్ఈఐ) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ రెండు నగరాలు ఒకటి, రెండు స్థానాలను ఆక్రమించుకున్నాయి. సగటు వార్షిక జనాభా వెయిట్  పీఎం 2.5 ఎక్స్‌పోజర్ పరంగా ఢిల్లీ, కోల్‌కతాలను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ముంబై 14వ స్థానంలో నిలవగా, టాప్-20లో మరే భారత నగరం లేకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. 

గాలిలో పీఎం 2.5 ఉందంటే మానవులకు తీవ్ర ముప్పు వాటిల్లినట్టే. పీఎం 2.5 కారణంగా ప్రతి లక్ష మందికి 124 మరణాలతో చైనా రాజధాని బీజింగ్‌ అగ్రస్థానంలో ఉండగా, 106 మరణాలతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. 99 మరణాలతో కోల్‌కతా 8వ స్థానంలో నిలిచింది. ఇక, చైనాకు చెందిన ఐదు నగరాలు టాప్‌-20లో ఉండడం గమనార్హం. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 7 వేల నగరాలను లెక్కలోకి తీసుకున్నారు. అయితే, ఆరు ప్రాంతాల్లోని 103 నగరాలను మాత్రమే ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

ఇక, సగటు ఎన్ఓ2 ఎక్స్‌పోజర్ పరంగా చూసుకుంటే చైనాలోని షాంఘై అత్యంత చెత్త నగరంగా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌లోని ఏ నగరం కూడా టాప్-20లో లేకపోవడం గమనార్హం. పీఎం 2.5, ఎన్ఓ2 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిబంధనలు ప్రపంచంలోని పలు నగరాలు ఎప్పుడో అధిగమించేసి ముప్పును కొని తెచ్చుకున్నాయి. 

2019లో ఢిల్లీలో సగటు పీఎం 2.5 ఎక్స్‌పోజర్ ప్రతి క్యూబిక్ మీటర్‌కు 110 మైక్రోగ్రాములు ఉన్నట్టు తేలింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే 22 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇది కోల్‌కతాలో 84 మైక్రోగ్రాములుగా ఉంది. 2019 నివేదికలో చేర్చిన 7 వేల కంటే ఎక్కువ నగరాల్లో 86 శాతం కాలుష్య కారకాలకు గురయ్యాయి. ఫలితంగా దాదాపు 2.6 బిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపినట్టు నివేదిక పేర్కొంది.

More Telugu News