Hooded Pitohui: పిట్ట చిన్నదే.. కానీ మహా డేంజరస్​.. ఈకలు, గోళ్లలోనూ విషం!

  • పపువా న్యూగినియాలో ఉండే హుడెడ్ పిటొహుయ్ పక్షి
  • ఈ పక్షి గోర్లతో గీకితే ఆ ప్రాంతం మొత్తం మొద్దుబారిపోయే పరిస్థితి
  • దీని విషం శరీరంలోకి ప్రవేశిస్తే, గుండె పోటు వచ్చే ప్రమాదం
  • ‘గార్బేజ్ బర్డ్’గా పిలుచుకుంటున్న స్థానికులు
Hooded pitohui the worlds first scientifically confirmed poisonous bird

మామూలుగా విష పూరిత జంతువులు అనగానే పాములు, తేళ్లు, కొన్ని రకాల కీటకాలు గుర్తొస్తాయి. మహా అయితే కొన్ని రకాల కప్పలు, చేపల్లో విషం ఉంటుందని అంటారు. కానీ పపువా న్యూగినియాలో ‘హుడెడ్ పిటొహుయ్’ పేరుతో పిలిచే ఓ విష పూరితమైన ఓ పక్షి ఉంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఈ పక్షిలో నిలువెల్లా విషం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీని శరీరంలో అవయవాలతోపాటు చర్మం, ఈకలు, గోళ్లలోనూ విషం ఉంటుందని గుర్తించారు. దాని ఈకలను నోట్లో పెట్టుకున్నా, ఆ పక్షిగానీ గోళ్లతో గీకినా.. ఆ భాగం మొద్దుబారిపోతుందని, కొన్ని గంటల పాటు నొప్పి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.

న్యూరో ట్యాక్సిన్ ప్రభావంతో..
పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండీ ద్వీప దేశం పపువా న్యూగినియాలో స్థానికులకు ఈ పక్షి గురించి వందల ఏళ్లుగా తెలుసని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడికి వలస వచ్చిన యూరోపియన్లు, ఇతరులు దీని బారిన పడిన తర్వాతే ప్రపంచానికి ‘హుడెడ్ పిటోహుయ్’ పక్షి గురించి పూర్తిగా తెలిసింది. మన నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపించే ‘బట్రాచోటాక్సిన్’ అనే న్యూరో ట్యాక్సిన్ ఉంటుంది. దాని ప్రభావంతో తీవ్రమైన మంట, నొప్పి పుడతాయి.

పొరపాటున నోరు తగలడంతో.. 
1990లో జాక్ డంబచర్ అనే ఓ పక్షి శాస్త్రవేత్త పపువా న్యూగినియాకు వచ్చారు. చెట్ల మధ్య సన్నని వలలు కట్టి పక్షులను పట్టుకుని పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ పిటోహుయ్ పక్షి గోళ్లతో ఆయన చేతిపై గీసింది. మంటగా ఉండటంతో ఆయన వెంటనే చేతిని నోట్లో పెట్టుకున్నారు. కానీ కాసేపటికే నోరంతా మంట, నొప్పి మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు తీవ్రంగా అవస్థ పడ్డారు. తొలుత ఆ పక్షి వల్ల కాదేమో అనుకున్నారు. కానీ తర్వాత అనుమానం వచ్చి ఆ పక్షి ఈకను నోట్లో పెట్టుకుని చప్పరించడంతో.. తిరిగి మంట, నొప్పి మొదలయ్యాయి. ఇలా ప్రపంచానికి హుడెడ్ పిటొహుయ్ విష పూరిత లక్షణం గురించి తెలిసింది.

కొన్నిసార్లు చాలా డేంజర్
ఈ పక్షిలో విషం ఎక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని డోసు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తే పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒక్కోసారి గుండెపోటుకు గురై మరణించే ప్రమాదమూ ఉంటుందని చెబుతున్నారు. నిజానికి పపువా న్యూగినియాలో స్థానికులు ఈ పక్షి అంటేనే దూరంగా ఉంటారు. దీని మాంసం నుంచి దుర్వాసన వస్తుందని.. అందుకే స్థానికులు దీనిని ‘గార్బేజ్‌ బర్డ్‌ (చెత్త పక్షి)’గా పిలుస్తుంటారు.

More Telugu News