దేశాన్ని కుల మతాల పేరుతో విడదీస్తున్నారు. విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం కష్టం: సీఎం కేసీఆర్​

17-08-2022 Wed 17:43 | Telangana
  • కొందరు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారన్న కేసీఆర్ 
  • చైనా మాదిరిగా అంతా కుల మత రహితంగా ముందుకు సాగాలని పిలుపు
  • దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందు నిలుస్తోందని వెల్లడి
Country is being divided in the name of caste and religion It is difficult to recover if hatred is spread Says CM KCR
భారతదేశాన్ని కులమతాల పేరుతో విడదీసే ప్రయత్నం జరుగుతోందని.. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. చైనా తరహాలో అందరూ కులమత రహితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందన్నారు. 

ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లు దగా పడ్డామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు కొందరు ఉంటారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతామని పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

ఢిల్లీలో కరెంటు రాదు.. తెలంగాణలో కరెంటు పోదు
పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో కొత్తగా 10 లక్షల పింఛన్లు అందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ గణనీయంగా పెరిగాయన్నారు. దేశంలో నిరంతరంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. 

‘‘హైదరాబాద్‌లో కరెంటు పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటలు కరెంటు రాదు. అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే ఎక్కువ వేతనం పొందుతున్నారు. పేద కుటుంబాల్లో ఆడ పిల్లల పెళ్లికి రూ.లక్ష సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. మెదడు రంగరించి హృదయంతో ఆలోచిస్తేనే మంచి పనులు చేయగలుగుతాం” అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇప్పుడు తెలంగాణకే వలస వస్తున్నారు
గతంలో వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేవారని.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛను పుణ్యమా అని ఆ బాధ తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.

గతంలో తెలంగాణ నుంచి దుబాయ్, ముంబైలకు వలస వెళ్లేవారని.. ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రజలు వలస వస్తున్నారని పేర్కొన్నారు. 60 ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణంగా ఉండేదని.. అందుకే ఇన్నేళ్లు గోస పడ్డామని వ్యాఖ్యానించారు. అందుకే దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లోనూ చర్చ జరగాలని.. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే ముందుకు పురోగమిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.