Flipkart: నాణ్యత లేని ప్రెషర్​ కుక్కర్లు అమ్మినందుకు ఫ్లిప్​ కార్ట్​ కు జరిమానా

  • రూ.లక్ష జరిమానా విధించిన కేంద్ర వినియోగదారుల హక్కుల సంస్థ (సీసీపీఏ)
  • 598 ప్రెషర్ కుక్కర్లను వెనక్కి తీసుకుని డబ్బును రిఫండ్ చేయాలని ఆదేశాలు
  • వివరాలు వెల్లడించిన సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే
Flipkart to pay Rs lakh fine for selling sub standard pressure cookers

ఫ్లిప్ కార్ట్ సంస్థ తమ ఈ కామర్స్ వెబ్ సైట్లో సరైన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకు కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించింది. ఇలా నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా ఫ్లిప్ కార్ట్ ను ఆదేశించింది. నాణ్యత లేని కుక్కర్లకు సంబంధించి నమోదైన ఒక ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివరాలను సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే వెల్లడించారు. 

ఆ కుక్కర్లను వెనక్కి తీసుకోండి..

తమ ప్లాట్ ఫాంపై వినియోగదారులకు విక్రయించిన నాణ్యత లేని 598 కుక్కర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీసీపీఏ ఆదేశించింది. దీనికి సంబంధించి వెంటనే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని.. ఆ కుక్కర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును రీఫండ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై 45 రోజుల్లోగా కంప్లియన్స్ రిపోర్టును తమకు సమర్పించాలని ఆదేశించింది.

నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్ల విక్రయాలకు సంబంధించి సీసీపీఏ ఇటీవలే ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు కూడా జరిమానా విధించిన విషయం తెలిసిందే. అమెజాన్ ను కూడా కుక్కర్లను వెనక్కి తీసుకుని సొమ్మును రిఫండ్ చేయాల్సిందిగా సీసీపీఏ ఆదేశించింది.

More Telugu News