Subrahmanyam Jaishankar: పాశ్చాత్యదేశాలకు మరోసారి తిరుగులేని బదులిచ్చిన విదేశాంగ మంత్రి జైశంకర్

  • దేశ ప్రజలకు చౌక ఆయిల్ అందివ్వడం నైతిక బాధ్యత అన్న జైశంకర్ 
  • అధిక చమురు ధరలను భారతీయులు భరించలేరని వెల్లడి 
  • అందుకే రష్యా నుంచి కొనుగోళ్లు తప్పవన్న విదేశాంగ మంత్రి
Its my moral duty to ensure best deal for our citizens Jaishankar

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటున్న పాశ్చాత్య దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి నోరు ఎత్తలేని విధంగా బుదులిచ్చారు. అసలు రష్యా చమురు భారత్ కు ఎందుకు అవసరమో తేల్చి చెప్పారు. భారత ప్రజలు అధిక చమురు ధరలను భరించే స్థితిలో లేరంటూ, అందుకని రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘మా దేశ ప్రయోజనాల విషయంలో మేము ఎంతో నిజాయతీగా, పారదర్శకంగా ఉన్నాం. వార్షిక తలసరి ఆదాయం 2,000 డాలర్లు (రూ.1.60 లక్షలు) కలిగిన దేశం మాది. అధిక చమురు ధరలను ప్రజలు భరించలేరు. కనుక అత్యుత్తమ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సిన నైతిక బాధ్యత మాపై ఉంది’’ అని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ.. ఆ దేశంపై అమెరికా, ఐరోపా తదితర దేశాలు ఆర్థిక ఆంక్షలకు దిగడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 50 శాతం వరకు పెరిగిపోయాయి. మార్కెట్ ధర కంటే తక్కువకు సరఫరా చేస్తానని రష్యా ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురు కొనుగోళ్లు మొదలు పెట్టింది. 

కానీ, భారత్ అదనంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరడం గమనార్హం. ప్రతీ దేశం భిన్నమైన పరిస్థితుల్లో ఉందంటూనే.. రష్యా నుంచి అదనంగా కొనుగోలు చేయకుండా ఉండేందుకు భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 

దీనిపై జైశంకర్ స్పందిస్తూ.. భారత్ రష్యా నుంచి ఒక నెలకు కొనుగోలు చేస్తున్న చమురు.. యూరోప్ ఒక పూట కొనుగోలు చేస్తున్న మొత్తం కంటే తక్కువన్నారు. భారత్ ఇంధన భద్రత కోసం కొంత ఇంధనాన్ని రష్యా నుంచి కొనుగోలు చేసుకోక తప్పదని స్పష్టం చేశారు. జైశంకర్ థాయిల్యాండ్ పర్యటనలో ఉన్న సందర్భంగా మంగళవారం మాట్లాడారు.

More Telugu News