Mohammad Kaif: ధావన్ ను తప్పించి.. కెప్టెన్సీని మళ్లీ కేఎల్‌ రాహుల్‌కు అప్పగించడంపై కైఫ్ మండిపాటు!

  • జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా తొలుత ధావన్‌ను నియమించిన సెలక్టర్లు
  • కరోనా నుంచి కోలుకుని తిరిగొచ్చిన రాహుల్
  • ధావన్‌ను తప్పించి తిరిగి రాహుల్‌కు పగ్గాలు
  • ధావన్ ఇలాంటివి పట్టించుకోడన్న కైఫ్
KL Rahul Replacing Shikhar Dhawan As Captain kaif said its not right

జింబాబ్వేతో రేపటి నుంచి హరారేలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నట్టు తొలుత సెలక్టర్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్ కరోనా బారినపడడంతో తొలుత అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే, ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. 

అంతేకాదు, తొలుత ధావన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టిన సెలక్టర్లు ఇప్పుడు అతడిని తప్పించి రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ధావన్‌ను వైస్ కెప్టెన్‌గా మార్చారు. సెలక్టర్ల నిర్ణయంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. ‘ఇది కరెక్ట్ కాదు’ అంటూ సెలక్టర్లపై విమర్శలు కురిపించాడు. 

రాహుల్ ఫిట్‌గా ఉన్నాడని ధావన్‌ను తప్పించి మళ్లీ అతడికి పగ్గాలు అందించడం సరికాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ధావన్ కెప్టెన్సీలో ఆడినా పెద్దగా తేడా ఉండబోదన్నాడు. ఈ పరిస్థితిని నివారించొచ్చని పేర్కొన్నాడు. రాహుల్ కరోనా నుంచి కోలుకున్నట్టు నివేదిక ఆలస్యంగా వచ్చి ఉండొచ్చని, ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చన్నాడు. 

అయితే, ఆసియా కప్‌‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ అవసరమన్న కారణంతో అతడిని జట్టులోకి తీసుకుని ఉండొచ్చన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ మార్పు సరికాదని కైఫ్ స్పష్టం చేశాడు. ఎవరినైనా కెప్టెన్‌గా ఎంపిక చేసేముందు వారితో కమ్యూనికేషన్ కూడా సరిగా ఉంటే అప్పుడు ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉండదన్నాడు. ఆటగాడిగా శిఖర్‌ ఎప్పుడూ కూల్‌గా ఉంటాడని, అతడు ఇలాంటి వాటిని పట్టించుకోడని కైఫ్ పేర్కొన్నాడు.

More Telugu News